ధ్రువీకరణ పత్రాలు పొందండిలా
నిడమర్రు: విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజ్ రీయింబర్స్మెంట్ పొందేందుకు, కళాశాల, పాఠశాలల్లో ప్రవేశాలకు, పోటీ పరీక్షల దరఖాస్తులకు వివిధ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. రెవెన్యూ శాఖ నుంచి జారీ అయ్యే ఈ పత్రాల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. రెవెన్యూ శాఖ అధికారులు (వీర్వో/ఆర్ఐ) ఇచ్చిన నివేదిక ఆధారంగా తహసీల్దార్ ఆన్లైన్లో ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. వాటిని తిరిగి మీ సేవ కేంద్రాల నుంచి మాత్రమే పొందాలి. ఈ వివరాలు మీ కోసం..
దరఖాస్తు చేసుకుంది మొదలు జారీ వరకూ దరఖాస్తుతోపాటు ఆన్లైన్లో పొందుపరిచిన సెల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. అధికారులు విచారణ చేసి జారీ చేసే ధ్రువీకరణ పత్రాలు బి–కేటగిరిలోకి వస్తాయి. బి–కేటగిరి పత్రాలు పొందాలంటే సర్వీస్ చార్జి కింద రూ.35 చెల్లించాలి. రూ 35 మించి వసూలు చేస్తే మీ సేవ కేంద్రం నిర్వాహకులపై ఫిర్యాదు చేయవచ్చు.
ఆదాయ ధ్రువీకరణ పత్రం.. ఒక వ్యక్తి / కుటుంబ ఆదాయాన్ని అధికారికంగా ధ్రువీకరించి జారీ చేసే పత్రం.
మీ సేవ కేంద్రంలో దరఖాస్తుతోపాటు రేషన్ కార్డు/ ఓటరు గుర్తింపు కార్డు/ ఆధార్ కార్డు నకలు, ప్రభుత్వ/ ప్రై వేట్ ఉద్యోగులు/వ్యాపారులు ఆదాయ పన్ను రిటర్న్ కాపీ నకలు జతచేయాలి.
నివాస ధ్రువీకరణ పత్రం .. పౌరుడు గ్రామం/టౌన్/వార్డులో శాశ్వత నివాసం ఉన్నట్లుగా నిర్ధారిస్తూ జారీ చేసే ధ్రువీకరణపత్రం (నివాస స్థలం లేదా పర్మినెంట్ ఉద్యోగస్తులకు).ఈ ధ్రువపత్రాలు రెండు రకాలుగా జారీ చేస్తారు. ఒకటి సాధారణం, రెండోది పాస్‌పోర్ట్ సేవలు పొందేందుకు.
మీ సేవలో ఇచ్చిన దరఖాస్తుతోపాటు రేషన్/ఓటరు/ఆధార్ కార్డు నకలు.రేషన్/ ఆధార్/ ఓటరు కార్డు లేని వారికి వారు నివాసముంటున్న ఇంటి పన్ను/టñ లిఫోన్/విద్యుత్ బిల్లు, ఫొటో (పాస్‌పోర్ట్ సేవలు కోసం తప్పనిసరి) జతచేయాలి.
ఇంటిగ్రేటెడ్ ధ్రువీకరణ పత్రం ..విద్యా/ ఉద్యోగ సంబంధిత దరఖాస్తులకు అవసరమైన కులం, నివాసం, జనన తేదీ కలిపి ఒకే పత్రంలో పొందుపరిచి జారీ చేసేది ఇంటిగ్రేటెడ్ ధ్రువీకరణ పత్రం. దరఖాస్తుతోపాటు దరఖాస్తుదారుని కుటుంబ సభ్యుల కుల ధ్రువీకరణ పత్రం, ఎస్ఎస్సీ సర్టిఫికెట్/ టీసీ/ 1 నుంచి 10 వరకు స్టడీ సర్టిఫికెట్/మునిసిపాలిటీ లేదా పంచాయతీ జారీ చేసి జనన ధ్రువీకరణ పత్రం జతచేయాలి.
ఓబీసీ ధ్రువీకరణ పత్రం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న కుల రిజర్వేషన్ పొందేందుకు అధికారులు ఓబీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దరఖాస్తుతోపాటు రేషన్ కార్డు /ఓటరు / ఆధార్ కార్డు, దరఖాస్తుదారుని తండ్రి/తల్లి సంపద వివరాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ట్యాక్స్ పరిధిలో ఉన్న ఉద్యోగులు, వ్యాపారులు ఐటీ రిటర్న్ కాపీ జతచేయాలి.
ఈబీసీ ధ్రువీకరణ పత్రం.. ఆర్థికంగా వెనకబడిన ఓసీలు రిజర్వేషన్ సౌకర్యం ఉన్న కులాలలతో సమానంగా గహ నిర్మాణ, స్థలం తదితర ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందేందుకు ఈబీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. దరఖాస్తుతోపాటు రేషన్ కార్డు/ఓటరు/ ఆధార్ కార్డు నకలు సమర్పించాలి.
––––––––––––––––––
ధ్రువీకరణ పత్రం సర్వీస్ కాల ఒప్పందం మొదటిసారి
ఆదాయ ఏడు రోజులలోపు
నివాస ఏడు రోజులు లోపు
ఇంటిగ్రేటెడ్ 30 రోజుల్లోపు
ఓబీసీ 30 రోజుల్లోపు
ఈబీసీ ఏడు రోజులలోపు
–––––––––––––
పైన సూచించిన ఒప్పంద కాలంలో ధ్రువీకరణ పత్రం జారీ చేయడం లేదా జారీ చేయకపోవడానికి కారణాలను దరఖాస్తుదారునికి తెలియజేయాలి. లేకపోతే శాఖా పరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దరఖాస్తు నిలిచి జారీకి ఆలస్యమైన కారణం సహేతుకం కాకపోతే సంబంధిత ఉద్యోగి జీతం నుంచి జరిమానాగా ఉన్నత అధికారులు కోత విధిస్తారు.