ఎంత సపోర్ట్ ఉందన్నది కాదు... ఎంత కష్టపడ్డామన్నదే ముఖ్యం - చిరంజీవి
‘‘ ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా టైటిల్ వినగానే నా సినిమాలు ‘దొంగ మొగుడు’, ‘బావగారూ బాగున్నారా’ సినిమాలు గుర్తుకువచ్చాయి’’ అని చిరంజీవి అన్నారు. సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘దిల్’రాజు నిర్మించిన చిత్రం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. శిరీష్, లక్ష్మణ్ సహ నిర్మాతలు. మిక్కీ జె. మేయర్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో చిరంజీవి విడుదల చేశారు. ఈ సంద ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ -‘‘ప్రతి శాఖలోనూ గ్రిప్‌ను సంపాదించి మంచి నిర్మాతగా కొనసాగుతున్న ‘దిల్’రాజు, అలాగే ‘గబ్బర్‌సింగ్’ సినిమాను ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్ని ఫ్రేముల్లోనూ తేజు చాలా కష్టపడ్డాడని అందరూ అంటూంటే చాలా ఆనందం వేసింది.
ఎంత సపోర్ట్ ఉందన్నది కాదు... ఎంత కష్టపడ్డామన్నదే ముఖ్యం అని ఎప్పుడూ చెబుతూ ఉంటా’’ అని అన్నారు. ‘‘మెగాస్టార్ అభిమానులు కాలర్ ఎగరేసుకుని తిరిగేలా కష్టపడతాను’’ అని సాయిధరమ్ తేజ్ చెప్పారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్‌ను మొదలు పెట్టి 14 ఏళ్లయింది. ‘పిల్లా నువు లేని జీవితం’ సినిమాకు ముందే సాయిధరమ్ తేజ్‌ను ఈ సినిమాలో హీరోగా అనుకున్నాం. సాయిధరమ్ తేజ్ నాలుగో సినిమాకే పవన్‌కల్యాణ్ రేంజ్‌కు వెళ్లిపోతారు. వచ్చే నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు రావు రమేష్, దర్శకులు రవికుమార్ చౌదరి, అనిల్ రావిపూడి, ‘పవర్’ బాబి, గోపీచంద్ మలినేని తదితరులు పాల్గొన్నారు.