సుబ్రమణ్యం సోల్డ్!
కొత్త సినిమా గురూ!
చిత్రం: సుబ్రమణ్యం ఫర్ సేల్
పాటలు: భువనచంద్ర, చంద్రబోస్, వనమాలి, భాస్కరభట్ల
సంగీతం: మిక్కీ జె. మేయర్
కెమెరా: సి. రామ్‌ప్రసాద్
ఎడిటింగ్: గౌతంరాజు
స్క్రీన్‌ప్లే: రమేశ్‌రెడ్డి, సతీశ్ వేగేశ్న, తోట ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: హర్షిత్
సహ నిర్మాతలు: శిరీష్ - లక్ష్మణ్
నిర్మాత: ‘దిల్’ రాజు
కథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌శంకర్
నిడివి: 154 నిమిషాలు
బడ్జెట్: రూ.14 కోట్ల పైగా
బిజినెస్: 20 కోట్ల పైగా (కొన్ని ఏరియాలు నిర్మాతవే)
శాటిలైట్: 3.75 కోట్లు
టేబుల్ ప్రాఫిట్!
అమ్మకానికి చాలా వస్తువులుంటాయి. దాదాపు అన్నీ డిస్కౌంట్ మీదే దొరుకుతాయి. కాంపిటీషన్ పెరిగేకొద్దీ డిస్కౌంట్ పెరుగుతుంది.కుర్ర హీరోల్లో కాంపిటీషన్ భేషుగ్గా ఉంది.అయినా, సుబ్రమణ్యం సేల్ వితౌట్ డిస్కౌంట్ నడుస్తోంది. మేనమామల పోలికని కొందరు... మెగాస్టార్ మూవ్‌మెంట్లని ఇంకొందరు... బాక్సాఫీస్‌కి బాగా పనికొస్తాడని అందరూ... మూడో సినిమాకు మూడ్ సెట్టయింది! శుక్రవారం కంటే ముందే సాయిధరమ్ తేజ్ సోల్డ్!!
సినీ ప్రపంచంలో కథలు పది పన్నెండే అన్నది ఒక సూత్రీకరణ. ‘కొత్త కథలంటూ ఉండవు. ఒక పాయింట్ తీసుకొని పాత కథనే కొత్తగా చెప్పాల’న్నది సినీజనం నమ్మే బాక్సాఫీస్ సూత్రం. ఈ రెంటినీ అర్థం చేసుకోవడమే కాక, ఇప్పటి ట్రెండ్‌లో ఎంటర్టైనింగ్గా సినిమా తీయాలని చేసిన ప్రయత్నం - ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.
ఎవడీ సుబ్రమణ్యం? ఏమా కథ?
తల్లీతండ్రీ లేని పిల్ల సీత (రెజీనా). పెదనాన్న, బాబాయ్‌ల ప్రేమతో పెరుగుతుంది. ఫేస్బుక్లో మూడేళ్ళుగా చాటింగ్ చేస్తున్న అమెరికా అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇంట్లోవాళ్ళు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారంటూ, అతనితో పెళ్ళి, అమెరికాలో చదువంటూ పారిపోతుంది. ఇక, అమెరికాలో సుబ్రమణ్యం (సాయిధరమ్‌తేజ్)ది వేరే కథ. ప్రతి క్షణాన్నీ డాలర్‌గా మార్చాలని రకరకాల జాబ్స్ చేస్తుంటాడు. అమెరికాలో హీరో, హీరోయిన్లిద్దరూ తారసపడతారు. ఆమెను అమెరికా రప్పించిన ప్రేమికుడు మోసగాడన్న విషయం తెలిశాక, హీరో ఆమెను కాపాడతాడు. అలా దగ్గరైన వాళ్ళిద్దరూ డబ్బు కోసం ఒక చోట భార్యాభర్తలుగా నటించి, ‘బెస్ట్ కపుల్’ ప్రైజ్ కూడా కొట్టేస్తారు.
కజిన్ సిస్టర్ పెళ్ళికని హీరోయిన్, సవతి చెల్లి పెళ్ళికని హీరో ఇండియాకొస్తారు. హీరోయిన్ వెంట వాళ్ళింటికి హీరో కూడా వెళతాడు. అక్కడ వారిద్దరినీ అందరూ భార్యాభర్తలనుకుంటారు. వీళ్ళు కూడా తప్పనిసరై, అదే నాటకం ఆడతారు. మరోపక్క హీరోను చూసి ‘సుబ్రమణ్యం తిరిగొచ్చాడు’ అంటూ కొందరు విలన్లు వెంట పడతారు. విలన్ చెల్లితో పెళ్ళికి ఒప్పుకొని, తీరా అనుకోని పరిస్థితుల్లో హీరో అమెరికా పారిపోయాడన్నది ఫ్లాష్‌బ్యాక్. హీరో వారి నుంచి ఎలా బయటపడ్డాడు? హీరోయిన్, హీరోల పెళ్ళి ఎలా అయిందన్నది మిగతా కథ.
బోలెడన్ని సీన్లు... పాత్రలు...
మూడు పాటలు, ఆరు సీన్లుగా సినిమా ఫస్టాఫ్ సుదీర్ఘంగా నడిచినట్లనిపించినా, సెకండాఫ్ వినోదం ఎక్కువ పంచుతుంది. ఈ సినిమాలో లేనిది లేదు. కోట శ్రీనివాసరావు, జీవా, సప్తగిరి, ‘ప్రభాస్’ శీను - ఇలా ప్రముఖులు చేసిన ఒకటి, రెండు సీన్ల పాత్రలున్నాయి. ఒకటికి నాలుగు పెళ్ళి సీన్లున్నాయి. పీటల మీద పెళ్ళిళ్ళు ఆఖరు క్షణంలో ఆగిపోవడాలున్నాయి. ఒకరిని ప్రేమిస్తూ, వేరొకరితో పెళ్ళికి సిద్ధపడడమనే త్యాగాలుంటాయి. పెళ్ళి కాని వ్యక్తులు పెళ్ళయినంత ఫీలింగిచ్చే చీటింగ్ డ్రామా ఉంది. ఒకరికి ముగ్గురు విలన్లుంటారు. ‘చంటిపిల్ల తప్పిపోతే వెతుక్కోవాలి. ఎదిగినపిల్ల పారిపోతే మర్చిపోవాలి’ లాంటి జీవితసూత్రాలు ఒకదాని వెంట మరొకటొచ్చి పడిపోతుంటాయి. ఎప్పటికప్పుడు మనసు మార్చుకొని మాట మార్చే పాత్రలుంటాయి. ఇలా చాలా ఐటమ్సున్నాయి.
హుషారైన నటన... ఉత్సాహంగా డ్యాన్సులు...
మొదలైంది మొదటైనా, రిలీజ్లో రెండోదిగా మారిన ‘రేయ్’ చిత్రం నుంచే ‘సుప్రీమ్ హీరో’ బిరుదాంకితుడైన నటుడు సాయిధరమ్ తేజ్. ముచ్చటైన ఈ మూడో సినిమాలోనూ హీరోయిజమ్‌పై డిపెండయ్యారు. రూపురేఖల్లోనే కాదు, హావభావాల్లోనూ తన ‘మెగా’ మేన మామల నుంచి ఈ కొత్త హీరో చాలానే పుణికిపుచ్చుకున్నారు. తెరపై అది తరచూ తొంగిచూస్తుంటుంది. సన్నివేశాల్లో హుషారుగా, డ్యాన్సుల్లో ఎనర్జిటిక్‌గా చేశారు.
‘సీత... సీత ఇక్కడ... అంత ఈజీ కాదు...’ అనే కథానాయిక పాత్రలో రెజీనా అందంగా ఉంది. ఆ పాత్ర రూపకల్పనతో పోలిస్తే ఆమె ఆకర్షణే సినిమా అంతటా కొంత నిలకడైన విషయం. రావు రమేశ్ విలక్షణ మాట తీరుతో విలనిజమ్ చూపారు. మరో విలన్‌కి చెల్లెలుగా నటి ఆదా శర్మ ఇంట్లో ఏసీ రిపేరింగ్‌కు వచ్చే మెకానిక్‌తో లవ్‌లో పడే పాత్రలో కనిపిస్తారు. చంచల స్వభావమున్న ఈ చిన్న పాత్ర ఆమె కెరీర్ కన్నా కథకే కీలకం. విదేశాల్లో స్థిరపడ్డ ఒకప్పటి విలన్ ప్రదీప్‌శక్తి రెస్టారెంట్ ఓనర్‌గా చాలాకాలానికి కనిపించారు.
సెకండాఫ్‌లో... కామెడీ రిలీఫ్
పెళ్ళి, మొగుడుకు సంబంధించి సాగే ఈ కన్ఫ్యూజన్ డ్రామాలో రిలీఫ్ - బ్రహ్మానందం పోషించిన చింతకాయ్ పాత్ర. వంట రాకపోయినా చేయి తిరిగిన వంటవాడిలా బిల్డప్ ఇస్తూ, అమెరికాకు వచ్చే ఆ పాత్రలో బ్రహ్మానందం నటన, అతని అంతరాత్మ చేసే విన్యాసం నవ్విస్తాయి. రౌడీ గ్యాంగ్ ‘ఫిష్’ వెంకట్ బృందం చేసే చేష్టలు వినోదం పంచుతాయి. ఈ చిత్రంలో ‘జమ్.. పంకజమ్.. మిఠాయి పంకజమ్’ (ఓనర్ భార్య-బ్రహ్మానందం ట్రాక్), ‘మొహం మొగ్గలా ఉండడం’, లైంగిక చర్యను సంకేతిస్తూ ‘కారులో యోగా’ లాంటి డైలాగుల్ని వినిపిస్తారు. ‘(శోభనంగదిలో) నువ్వు అరిస్తే మంచి మేటరున్న మొగుడు దొరికాడనుకుంటారు’ అని హీరోయిన్ గురించి హీరోతో అనిపిస్తారు.
కొత్తగా రేకెత్తే... పాత జ్ఞాపకాలు
సాంకేతిక విభాగాల్లో - ఛేజింగుల్లో కెమేరా వర్క్, టాప్ యాంగిల్ షాట్స్, హైవే ఫైట్ (ఫైట్ మాస్టర్ రామ్ - లక్ష్మణ్) లాంటివి ప్రత్యేకించి గుర్తుంటాయి. హీరో ఒక్కడికే కాక చాలా భాగం సీన్లకీ బోలెడంత బిల్డప్ ఇచ్చిన వైనం సినిమాలో కనిపిస్తుంది. కానీ, బ్రహ్మాండం బద్దలవుతుందనుకొనే ప్రతి సీనూ, బద్దలు చేస్తుందనుకున్న ప్రతి పాత్రా మళ్ళీ మామూలుగా మారిపోతూ, ప్రేక్షకుల ఊహకందకుండా తిరుగుతాయి. ఒక రకంగా ఇది ప్లస్సే అయినా, మోసపోయాననే ఫీలింగ్ ప్రేక్షకుడికి కలిగితేనే చిక్కు. ఇక, చివరకొచ్చేసరికి ఉడికీ ఉడకని సెంటిమెంట్, సగటు సీరియల్ తరహా క్లైమాక్స్ ఎదురవుతాయి. మొత్తానికి, దర్శకుడు చెప్పినట్లే, ఈ సినిమా గతంలో వచ్చిన అనేక చిత్రాల ప్యాట్రన్‌లో నడిచే కలగూర గంప. ‘మొగుడు కావాలి’, ‘బావగారూ బాగున్నారా’ నుంచి ఎన్టీయార్ ‘బృందావనం’ దాకా చాలా సిన్మాలు, సీన్లు గుర్తొస్తాయి. ‘గువ్వా గోరింకతో...’ రీమిక్స్ కొన్నేళ్ళ వెనక్కి తీసుకువెళుతుంది. వెరసి, పాత వెండితెర జ్ఞాపకాలనే కొత్తగా అమెరికా బ్యాక్‌డ్రాప్‌తో కళ్ళ ముందుకు తెచ్చే కమర్షియల్ ఎంటర్టైనర్ - ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’. - రెంటాల జయదేవ
సేల్ వెనక... కథ!
‘మిరపకాయ్’ టైవ్ులోనే హరీశ్ రాసుకున్న కథ ఇది. కొందరు బ్యాంకాక్, సింగపూర్ నేపథ్యాల్లో తీద్దామన్నా, అమెరికా బ్యాక్‌డ్రాపే కావాలని ఆ ఆఫర్లు వద్దనేశారు. ఈ సినిమాకు పట్టిన షూటింగ్ డేస్ 90. అందులో 40 రోజులు అమెరికాలోని న్యూయార్క, న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా, గ్రాండ్ కానియన్ల దగ్గరే షూటింగ్. మొదట పూజాహెగ్డే హీరోయిన్. తీరా ఆమెకు హృతిక్‌రోషన్ ‘మొహంజొదారో’లో భారీ ఛాన్సొచ్చింది. దాంతో ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పి, రెజీనాను తీసుకున్నారు. ‘ఖైదీ నంబర్ 786’లో ఎస్పీబీ, జానకి పాడిన భువనచంద్ర రచన ‘గువ్వా గోరింకతో’ ఈసారి మనో, రమ్య పాడారు. సినిమాకు మ్యూజిక్కిచ్చింది మిక్కీ జె. మేయర్. అయితే, ఒకప్పటి ఈ రాజ్-కోటి హిట్ ట్యూన్‌ను రీమిక్స్ చేసింది ‘కృష్ణాష్టమి’ మ్యూజిక్ డెరైక్టర్ దినేష్. గ్రాండ్ కానియన్ దగ్గర టూరిస్ట్ స్పాటైన స్కైవాక్పై రెండు రోజులు ఉదయం 5 నుంచి 7 వరకు ఈ పాట తీశారు.