మధ్యాహ్న భోజనం పెట్టకుంటే డబ్బులివ్వాలి!
► వరుసగా 3 రోజులు పథకం అమలుకాని స్కూళ్లకు వర్తింపు
► ఒక్కో విద్యార్థికి సంబంధిత స్కూలు రూ. 31 చెల్లించేలా నిబంధన
► తప్పిదాలకు పాల్పడే ఏజెన్సీలు, అధికారులపైనా కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం పథకం అమల్లో సంస్కరణలు తెచ్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఆహార భద్రత చట్టం నిబంధనలకు అనుగుణంగా పథకం నిబంధనలను మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా స్కూ లు విద్యార్థులకు వరుసగా మూడు రోజుల పాటు భోజనం పెట్టకపోతే ఆ పథకాన్ని అమలు చేసే స్కూలు (విద్యాశాఖ) సంబంధిత విద్యార్థులకు ఆ మూడు రోజులకు విద్యార్థులకు అయ్యే ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. అంటే పాఠశాలలో ఒక్కో విద్యార్థిపై ఎంత మొత్తాన్ని ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని చెల్లించేలా నిబంధనల్లో విద్యాశాఖ మార్పులు చేస్తోంది. రోజూ 200 గ్రాముల చొప్పున బియ్యానికి అయ్యే ఖర్చుతోపాటు ఒక్కో విద్యార్థికి అవసరమయ్యే కూరగాయలు, వండిపెట్టేందు కు రోజుకు ఇస్తున్న రూ. 4.70 చొప్పున మొత్తంగా మూడు రోజులకు రూ. 31కిపైగా సంబంధిత పాఠశాల చెల్లించాల్సి ఉంటుం ది.
అలాగే మూడు రోజులపాటు భోజనం ఎందుకు పెట్టలేదన్న విషయంలో తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయట్లేదన్న ఆరోపణలు వస్తుండటంతోపాటు 10 మంది, 20 మంది లోపు విద్యార్థులున్న స్కూళ్లలో ఎక్కువ మంది విద్యార్థులను చూపుతూ ఏజెన్సీలు, సిబ్బంది బిల్లులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చింది. మరోవైపు నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించకపోయినా, తప్పిదాలకు పాల్పడినా మధ్యాహ్న భోజనం వండిపెట్టే ఏజెన్సీలు, సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు చేపట్టేలా విద్యాశాఖ నిబంధనలు రూపొందించింది. మెనూ అమలు చేయకపోయినా, నాణ్యమైన ఆహారాన్ని అందించకపోయినా సంబంధిత ఏజెన్సీని రెండుసార్లు హెచ్చరించనుంది. అయినా తీరు మార్చుకోకపోతే ఆ ఏజెన్సీని రద్దు చేయనుంది. ఈ మేరకు రూపొందించిన నిబంధనల ఆమోదం కోసం విద్యాశాఖ రెండు నెలల కిందటే ప్రభుత్వానికి ఫైలు సమర్పించింది.
రాష్ట్రంపై తగ్గనున్న ఆర్థిక భారం
దేశవ్యాప్తంగా ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఉన్న ఎలిమెంటరీ పాఠశాలల్లో పథకం అమలుకు అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం నిధులిస్తుండగా రాష్ట్రం 40 శాతం నిధులను వెచ్చిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్న దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి అదనంగా 9, 10 తరగతుల విద్యార్థులు దాదాపు 9 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే 100 శాతం నిధులను వెచ్చించి మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు దాదాపు రూ. 200 కోట్ల వరకు రాష్ట్రం అదనంగా వెచ్చిస్తోంది.
అయితే సెకండరీ స్కూళ్లలోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన సుబ్రమణియన్ కమిటీ సిఫారసు చేసింది. సెకండరీ స్కూళ్లలో చదివే విద్యార్థులు, కౌమార బాలికలకు పోషకాహారాన్ని అందించేందుకు దీన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ సిఫారసులను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. నూతన విద్యా విధానంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొని చేర్చాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొంత మేర ఆర్థిక భారం తగ్గనుంది.