రైతు నెత్తిన రాయితీ!
నాసిరకంగా సబ్సిడీ వేరుశనగ విత్తనాలు
సచ్చులు, పుచ్చులు, రాళ్లే ఎక్కువ
బయటి మార్కెట్లోనూ అదే ధర
మొలకెత్తుతాయో లేదోననే ఆందోళన
రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలు మరీ నాసిరకంగా ఉంటున్నాయి. ఇందులో సచ్చులు.. పుచ్చులు.. రాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని చూసి రైతులు, నేతలు విస్తుపోతున్నారు. రాయితీ విత్తనాలతో రైతుకు నష్టం తప్పదని అధికార పార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు. మేలు రకం విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులకు సూచిస్తున్నారు.
చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా సోమవారం రాయితీపై వేరుశనగ విత్తనాల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు మార్కెట్లో అందుబాటులో ఉన్న ధరతో నాసిరకం కాయలు పంపిణీ చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 1.36 హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో వర్షాధార వాణిజ్యపంటగా వేరుశనగను సాగుచేస్తారు. ప్రతి ఖరీఫ్‌కు 2లక్షల క్వింటాళ్ల విత్తనకాయలు అవసరమవుతాయి. ఈ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఎక్కువ సాగుచేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం సబ్సిడీపై జిల్లాకు 90 వేల క్వింటాళ్ల విత్తనకాయలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతానికి జిల్లాలోని వేరుశనగ సాగయ్యే 51 మండలాల్లో 45 వేల క్వింటాళ్ల కాయలను వ్యవసాయ అధికారులు పంపిణీ చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
దిగుబడి బాగా రావాలంటే మంచి విత్తనం ఎంపిక ఉండాలని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. ఈ దిశగా రైతులకు అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే అధికారులు రైతులకు మంచి విత్తనాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏపీ సీడ్స్ నుంచి కాయలు వస్తూనే గోడౌన్లలో భద్రపరిచే ముందు వాటిని నిశితంగా పరిశీలించాలి. కాయలు బాగా లేకుంటే వెనక్కి పంపాలి. కానీ అధికారులు ఇవేవీ చేయకపోవడంతో నాసిరకం కాయలు సరఫరా అవుతున్నాయి.
బస్తా కాయలకు సగం విత్తనాలే
సాధారణంగా నాణ్యమైన కాయలు వొలిస్తే 30 కిలోల బస్తాకు ఎంత లేదన్నా 22 కిలోల విత్తనం లభిస్తుంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కాయలు వొలిస్తే 15 కేజీల విత్తనాలే లభిస్తున్నాయని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో మరోసారి కొనాల్సిన పరిస్థితి తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కాయలను సరఫరా చేస్తోందని కాబట్టి మార్కెట్లో ధరలు నియంత్రణలో ఉన్నాయి. ప్రభుత్వం సరఫరా నిలిపేస్తే పరిస్థితి మారిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
50 శాతం కాయలే బాగున్నాయి
రాయితీపై పంపిణీ చేస్తున్న వేరుశనగ కాయలు 50 శాతమే బాగున్నాయని చిత్తూరు తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే సత్యప్రభ విమర్శించారు. ఆమె చిత్తూరు మండలంలోని వీఎన్ పేటలో సోమవారం వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా రైతులకు మేలు రకం కాయలు పంపిణీ చేయాలని సూచించారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న కాయలు 50 శాతం మాత్రమే బాగున్నాయన్నారు. వీటిని పంపిణీ చేయడం వల్ల రైతులు చాలా నష్టపోతారని ఆందోళన వ్యక్తంచేశారు.
మంచి విత్తన కాయలు కాదు సబ్సిడీ ధరతో ఇస్తున్న వేరుశెనగ కాయలు పంట సాగుకు ఎందుకూ పనికిరావు. 30 కిలోల బస్తాలో సగానికి పైగా నాసిరకం విత్తనకాయలు ఉన్నాయి. ఇటువంటి విత్తనకాయలను పొలంలో వేస్తే ఖర్చు తప్ప ఎటువంటి లాభం ఉండదు.-రామక్రిష్ణమ్మ, మిట్టపల్లె, సీటీయం
నాసిరకం విత్తనాలు అవసరమా?
ప్రభుత్వం సబ్సిడీ పేరుతో నాసిరకం విత్తనాలు ఇచ్చి మాలాంటి మధ్య తరగతి రైతులకు ఇచ్చి మోసం చేయడం దారుణం. మంచి విత్తనాలని రూ.1,500లతో కొన్నాం. అందులో 10కిలోలు కూడా విత్తేందుకు పనికిరావు.
-డి.గోపాల్, రాయునిచెరువు వడ్డిపల్లె