బిందుసేద్యంపై ఆసక్తి
లోకేశ్వరం, న్యూస్‌లైన్ : నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో బిందుసేద్యం విధానంలో పంటల సాగుతో అక్కడి రైతులు సాధిస్తున్న సత్ఫలితాలు ఇక్కడి రైతుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో జిల్లాలోనూ అదే విధానంలో కొందరు పంటలు సాగు చేపట్టి విజయవంతంగా ముందుకెళ్తున్నారు. మండలంలోని వాట్టోలి, కిష్టాపూర్, ధర్మోరా, పంచగుడి, పుస్పూర్, లోకేశ్వరం తదితర గ్రామాల్లో సుమారు 200 మంది రైతులు బిందుసేద్యం అనుసరిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి పసుపు, మొక్కజొన్న, పత్తి, నువ్వు, కూరగాయలు పండిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 800 ఎకరాల్లో బిందు పద్ధతిలో పంటలు సాగవుతున్నాయి.
రాయితీపై పరికరాలు
బిందుసేద్యం విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై యూనిట్లు అందిస్తోంది. రైతుల కోసం ఈ ఏడాది మండలంలో 90 శాతం రాయితీపై రూ.50 వేల విలువైన బిందుసేద్యం పరికరాల (కిట్)ను 80 మంది రైతులకు పింపిణీ చేసింది. ప్రస్తుతం సుమారు 80 మంది రైతులు బిందు సేద్యం విధానంలో పత్తి, మిర్చి, నువ్వు సాగు చేస్తున్నారు.
బిందుసేద్యంతో ప్రయోజనాలు..
20 నుంచి 30 శాతం పంట దిగుబడి అధికంగా వస్తుంది. మామూలుగా ఒక ఎకరానికి అవసరమైన నీటితో నాలుగెకరాలు సాగు చేయవచ్చు.
ఎత్తుపల్లాల భూమికి కాలువల ద్వారా నీరు పారించడం సాధ్యం కాదు. ఆ నేలలకు బిందుసేద్యం అనుకూలమైనది.
రాత్రివేళ కరెంటుతో మామూలుగా నీరు పెట్టడం కష్టం. కానీ బిందుసేద్యంతో సులువుగా రాత్రిపూట విద్యుత్ సరఫరా కష్టాలను అధిగమించవచ్చు.పంటలకు రసాయన ఎరువుల ను సైతం డ్రిప్ ఫిల్టర్ బాక్సులో పోస్తే ప్రతీ మొక్కకు చేరుతుంది.
నీరు పెట్టేందుకు మసుషుల అవసరం ఎక్కువగా ఉండనందున కూలీల వ్యయం బాగా తగ్గుతుంది కలుపు మొక్కలు ఎక్కువగా పెరగవు.