గ్యాస్ సరఫరాకు మళ్లీ ఆధార్ లింకు
* నగదు బదిలీ ద్వారా సబ్సిడీ చెల్లింపు
* జిల్లాలో 2,85,719 మంది వినియోగదారులకు కష్టాలే
* ఆధార్ అనుసంధానం చేయించుకున్న వారి సంఖ్య 7,44,797
* బ్యాంక్ ఖాతాలున్నది 5,98,282 మందికే
ఏలూరు సిటీ : వంటింట్లో గ్యాస్ బాంబు పేల్చేందుకు సర్కారు మరోసారి సన్నద్ధమైంది. గ్యాస్ సిలిండర్‌పై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని నగదు బదిలీ పథకం ద్వారా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు అధికారులు శనివారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. సాధారణ ఎన్నికలకు ముందే ఈ విధానాన్ని అమలు చేయగా, నగదు బదిలీ సక్రమంగా జరగకపోవడంతో వినియోగదారులు నానాతంటాలు పడ్డారు. అనేకమంది సబ్సిడీ మొత్తం అందక నష్టపోయూరు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అప్పటి సర్కారు దీనిని రద్దు చేయగా, తిరిగి అదే విధానాన్ని శనివారం నుంచి అమలు చేయనుండటంతో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.951 కాగా, సబ్సిడీ పోగా రూ.444కే వినియోగదారులకు అందిస్తున్నారు. ఇప్పటివరకు వినియోగదారులు నేరుగా రూ.444 చెల్లిస్తే సరిపోతుంది. నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఇకపై సిలిండర్‌కు రూ.951 చెల్లించి గ్యాస్ పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత సబ్సిడీ సొమ్మును వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
అంటే వినియోగదారుడు ప్రతిసారి సిలిండర్ కోసం సుమారు రూ.500 అదనంగా పెట్టుబడి పెట్టాల్సింది. ఆధార్ అనుసంధానం చేయించుకోని వారు, ఆధార్ కార్డు లేనివారు సబ్సిడీ మొత్తాన్ని కోల్పోతారు. ఆధార్ సీడింగ్‌కు ఫిబ్రవరి వరకూ ప్రభుత్వం అవకాశం ఇస్తున్నా.. అధార్ నమోదు చేరుుంచుకున్న వారు సైతం గతంలో సబ్సిడీ సొమ్ము అందక, కొందరికి పూర్తి సొమ్ము దక్కక అవస్థలు పడ్డారు.
మరి వీరికో...
నగదు బదిలీ పథకం వినియోగదారులకు పూర్తి స్థారుులో న్యాయం చేసేలా కనిపించటం లేదు. ప్రస్తుతానికి ఆధార్ సీడింగ్ చేరుుంచుకుని, బ్యాంకు ఖాతాలు ప్రారంభించిన వినియోగదారులకు మాత్ర మే నగదు బదిలీ పథకాన్ని వర్తింప చేస్తారు. ఫిబ్రవరి అనంతరం ప్రతి ఒక్కరూ ఈ పథకం కిందకు వెళ్లాల్సిందే. జిల్లాలో గ్యాస్ వినియోగదారులు 8,84,001 మంది ఉండగా, వీరిలో 7,44,797మంది ఆధార్ సీడింగ్ చేయించుకున్నారు. మిగిలిన 1,39,204 మందికి ఆధార్ అనుసంధానం కాలేదు. ఆధార్ సీడింగ్ చేయించుకున్న వారిలోనూ బ్యాంక్ ఖాతాలు ఉన్న వారి సంఖ్య 5,98,282 మాత్రమే.
ఆధార్ సీడింగ్ చేయించుకున్నా బ్యాంకు ఖాతా లేనివారు సుమారు 1,46,515 మంది ఉన్నారు. ఈ విషయూన్ని పక్కన ఉంచితే మొత్తానికి 2 లక్షల 85వేల 719మంది నగదు బదిలీ పథకంలోకి రావటం లేదు. వీరంతా అత్యవసరంగా ఆధార్ సీడింగ్ చేయించుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలు తెరవాల్సి ఉంది. ఇక దీపం పథకంలో బాగంగా జిల్లాలో 93,902 మందికి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చేందుకు నిర్ణయించారు. కానీ.. ఇందులో 89,624 మంది లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్ చేయగా, దీపం పథకంలో గ్యాస్ సిలిండర్స్ ఇచ్చింది 49,587మందికి మాత్రమే. మిగిలిన 44,315 మందికి ఈ పథకాన్ని అమలు చేయలేదు.