నెరవేరిన వైఎస్సార్ స్వప్నం
ఆధునిక పరిజ్ఞానంతో నిర్మితమైన రిజర్వాయర్
ప్రాజెక్టు పూర్తికి పన్నెండేళ్లు
జలయజ్ఞం ఫలాలు రైతుల దరికి చేరాయి. బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న తలంపుతో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పునాదిరాయి వేసిన ప్రాజెక్టులు పూర్తయి జలకళను సంతరించుకోవడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రామగుండం మండలం ఎల్లంపల్లి వద్ద ఆయన శంకుస్థాపన చేసిన శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి రావడంతో ఆయన ఆశయం నెరవేరినట్లయ్యింది.
– రామగుండం
జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2004 జూలై 28న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. మూడేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించి రూ.2,744 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు పనులను రూ.408.85 కోట్లకు బెంగళూరుకు చెందిన ఎస్పీఎంఎల్ ఐటీడీ సిమెంటేషన్ దక్కించుకుంది. రూ.191 కోట్లతో స్పిల్‌వే పియర్స్‌పై ఫ్యాబ్రికేషన్ గేట్ల పనులను ఎస్ఈడబ్ల్యూ (స్యూ), ఓం మెటల్స్ కంపెనీలు పొందాయి. ఎల్ఎస్నం.1/2004–05, 07–11–2004 ఉత్తర్వుల ప్రకారం ప్రాజెక్టును స్టేజ్–1, స్టేజ్–2గా విభజించారు. మొదటి స్టేజీలో ఫేజ్–1, ఫేజ్–2గా విభజిస్తూ ఫేజ్–1లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐటీడీ సిమెంటేషన్, ఫేజ్–2లో 6.5 టీఎంసీల నీటిని ఎన్టీపీసీకి పైపులైన్లతో నీటి సరఫరా చేసేందుకు ఎస్పీఎంఎల్ కంపెనీ దక్కించుకుంది.
ఇదీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విద్యుత్ అవసరాల దష్ట్యా ఎన్టీపీసీకి 6.5 టీఎంసీల నీటి సరఫరా.
రెండు టీఎంసీలు మంథనికి ఎత్తిపోతల పథకం ద్వారా కమాన్‌పూర్, మంథని నియోజకవర్గ పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీరు అందించడం. ఇందులో ఏడువేల ఎకరాలు స్థిరీకరణ. కమాన్‌పూర్ మండలంలో నాలుగు గ్రామాల్లో 1,380 ఎకరాలు, ముత్తారం మండలంలోని 17 గ్రామాల్లో 18,620 ఎకరాలకు నీరందించడం.
ప్రాజెక్టు ఎగువ భాగంలో కడెం ఎత్తిపోతల పథకం కింద మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసి 30వేల ఎకరాలు స్థిరీకరించడం.
ఏడు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లోని 206 గ్రామాల పరిధిలో రెండు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించడం. ఇందు కోసం వేంనూర్‌లో 12 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు పంపుహౌస్ నిర్మాణం.
160 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల భారీ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగించుకోవడం.
అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకంలో భాగంగా 10 టీఎంసీల నీటిని గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల నిమిత్తం పైపులైన్ల ద్వారా సరఫరా చేయడం.
పూడిక తొలగింపునకు ఆధునిక పరిజ్ఞానం
20 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌లోకి భారీ వర్షాలకు పూడిక చేరితే తొలగించేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 42 నుంచి 45వ బ్లాక్ వరకు అడుగుభాగంలో (రివర్స్ స్లూయిస్) గేట్లను ఏర్పాటు చేశారు. ఈ విధానం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు లేకపోవడంతో అందులో సగానికిపైగా పూడిక పేరుకుపోయింది. దీంతో ప్రాజెక్టు సామర్థ్యం భారీగా తగ్గిపోయింది. కానీ.. ఈ ప్రాజెక్టులో చుక్కనీరు లేకుండా బయటకు పంపించే వెసులుబాటు కల్పించారు. ప్రాజెక్టులోకి మట్టి చేరినా.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేలా గేట్లను అమర్చారు.
అందుబాటులోకి ప్రాజెక్టు
2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు వైఎస్సార్ మరణానంతరం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రజల ఆందోళనలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి నేపథ్యంలో వైఎస్సార్ తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు పూర్తిచేయగలిగారు. గతేడాదే అందుబాటులోకి వచ్చినా.. వర్షాలు లేకపోవడం.. రాయపట్నం వద్ద నిర్మించతలపెట్టిన నూతన వంతెన పూర్తికాకపోవడంతో నీటిని నిల్వ చేయలేకపోయారు. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురవడం.. వంతెన పూర్తికావడంతో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. తాజాగా ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరదనీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు గోదావరిఖని, రామగుండం పరిసర ప్రాంత ప్రజలు తరలివస్తున్నారు. ‘ఇదంతా వైఎస్సార్ చలవే..’ అంటూ మననం చేసుకుంటున్నారు. అయితే రెండు రోజులుగా ఎకధాటిగా వర్షం కురుస్తుండడంతో ముర్మూర్ నుంచి ప్రాజెక్టు వరకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. బురదలో వాహనాలు చిక్కుకుపోతుండడంతో కొంతమంది వాహనాలతో ముర్మూర్లోనే నిలిపివేసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు పలు రకాల అభివద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు.