విషయ పరిజ్ఞానంతోనే విజయం
చైతన్యపురి (హైదరాబాద్): విషయ పరిజ్ఞానంతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని విజిలెన్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ. ప్రదీప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లో 'సాక్షి' రాజధాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్‌రెడ్డి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన మెళకువలను వివరించారు. ప్రభుత్వానికి రెవెన్యూ, పోలీసు శాఖలు చాలా కీలకమైనవని తెలిపారు. సమాజానికి దగ్గరగా వెళ్లి సేవ చేసేది పోలీసులేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా ఏకాగ్రతతో ఆందోళన లేకుండా లక్ష్య సాధన కోసం రోజుకు 16 గంటలు కష్టించి చదివితే పోలీసు ఉద్యోగాలను కైవసం చేసుకుంటారన్నారు. అనంతరం సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. నైతిక విలువలు, కుటుంబం, సమాజం పట్ల బాధ్యత వహించే ఉద్యోగాల్లో ప్రధానమైనది పోలీసు ఉద్యోగమని పేర్కొన్నారు. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని, రిక్రూట్మెంట్ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ డెరైక్టర్లు శంకర్‌రెడ్డి, లక్ష్మణ్, పలువురు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.