భౌతిక దాడులు భావ్యం కాదు
► ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు
► మూతపడిన పాఠశాలలు, జూనియర్, ఇంజినీరింగ్ కళాశాలలు
► విజయవంతమైన ప్రైవేటు విద్యాసంస్థల బంద్
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలపై విద్యార్థి సంఘాలు అసాంఘిక శక్తులవలే దాడి చేయడం, భౌతికదాడులకు దిగడం భావ్యం కాదని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు ధ్వజమెత్తారు. విద్యాసంస్థలపై విద్యార్థి సంఘాల వేధింపులు, దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా గురువారం ప్రైవేటు విద్యాసంస్థలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలంతా కలసి బంద్ నిర్వహించారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలలు, వారికి మద్దతుగా ప్రైవేటు జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు సైతం ముందస్తుగా సెలవు ప్రకటించడంతో బంద్ సంపూర్ణమైంది. బంద్ సందర్భంగా అన్ని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులతో కలసి మౌన నిరసన ప్రదర్శనను నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఏడు రోడ్ల కూడలి నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకూ భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా నినాదాలతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు.
అనంతరం పొట్టి శ్రీరాములు కూడలి వద్ద పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్య సంఘాల ప్రతినిధి దుప్పల వెంకటరావు, విద్యాసంస్థల ప్రతినిధి జామి భీమశంకరరావు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్య ప్రతినిధి పి.జయరాం, అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.లక్ష్మణరావు తదితరులు మాట్లాడుతూ తప్పులు చేసే ఉద్దేశంతో ఏ ప్రైవేటు విద్యాసంస్థా ఉండదన్నారు. పొరపాటు జరిగితే బాధ్యులను చట్ట ప్రకారం శిక్షించడం తప్పుకాదన్నారు.
అయితే కొంతమంది అసాంఘిక శక్తులు విద్యార్ధి సంఘాల పేరుతో విద్యాసంస్థల యాజమాన్యంపై భౌతికదాడులకు దిగడం సరికాదన్నారు. ఆ హక్కు వారికి లేదన్నారు. విద్యార్థి సంఘాల నుంచి, అసాంఘిక శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల ఏజీఎం శ్రీనివాసరావు, అపుస్మా సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటరావు, పి.శ్రీకాంత్, ఎన్.వి.రమణమూర్తి, నారాయణరావు, చంద్రమోహన్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ త్రివిక్రమవర్మని సంఘ ప్రతినిధులు కలసి వినతి అందజేశారు.