సింగరేణిలో ‘వారసత్వ’ సందడి
► స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తుల వెల్లువ
► 11 రోజుల్లో 2,304 మంది ఉద్యోగుల నుంచి అప్లికేషన్లు
► తప్పుడు ధ్రువీకరణ పత్రాలిస్తే కఠిన చర్యలు: యాజమాన్యం
సాక్షి, హైదరాబాద్: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు భారీ స్పందన లభిస్తోంది. ఈ నెల 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవగా మంగళవారానికి 2,304 మంది ఉద్యోగులు తమ వారసులకు ఉద్యోగావకాశం కల్పించేందుకు స్వచ్ఛం ద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రెండేళ్లలోపు సర్వీసు కాలం మాత్రమే మిగిలిన 1,105 మంది ఉద్యోగులు సైతం ఉన్నారు. రెండేళ్ల సర్వీసు కాలం మిగిలిన ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ ద్వారా వారసులకు ఉద్యోగావ కాశం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల పథకా న్ని పునరుద్ధరించడం తెలిసిందే.
ఒకసారి అవకాశం కింద ఏడాది సర్వీసు మిగిలిన ఉద్యోగులకు సైతం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం సడలింపునిచ్చింది. దీంతో ఏడాది, రెండేళ్ల సర్వీసు మాత్రమే మిగిలిన ఉద్యోగుల నుంచి దరఖాస్తులు పోటెత్తుతు న్నాయి. రెండేళ్లకు మించి సర్వీసు మిగిలిన ఉద్యోగులూ దరఖాస్తు చేసు కుంటున్నార ని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను యాజమాన్యం మార్చిలో ప్రారంభించనుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆరు నెలల్లోపే వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఏడాది, రెండేళ్లలోపు సర్వీసు కాలం మిగిలిన ఉద్యోగుల వారసులకు వచ్చే ఆరు నెలల్లో ఉద్యోగాలు ఇచ్చే దిశగా చర్యలు చేపడుతోంది.
తప్పుడు ధ్రువపత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు..
తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ మానవ వనరుల విభాగం డైరెక్టర్ పవిత్రన్ కుమార్ హెచ్చరించారు. దరఖాస్తుదారులకు సహకరిం చేందుకు అన్ని ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయాలు, గనుల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ల ద్వారా కార్మికుల సందేహాలను తీర్చాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. అర్హులకు తప్పకుండా వారసత్వ ఉద్యోగం లభిస్తుందన్న భరోసా కల్పించాలని సూచించారు. మరోవైపు దళారులు రంగంలోకి దిగి వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని కార్మికుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎలాంటి సందేహాలున్నా హెల్ప్ డెస్క్‌ల ద్వారానే పరిష్కరించుకోవాలని సింగరేణి యాజ మాన్యం కార్మికులకు పిలుపునిచ్చింది.