కోర్టుకు హాజరుకావాలని కమిషనర్‌కు ఆదేశం
అనంతపురం న్యూసిటీ: సుదర్శన్ కమ్యూనికేషన్స్ వ్యవహారంలో వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసును ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి ప్రవీణ్‌కుమార్ సోమవారం మునిసిపల్ లీగల్ అడ్వైజర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నగరంలో సుదర్శన్ కమ్యూనికేషన్స్ నిర్వాహకులు కేబుల్ కు రైట్ ఆఫ్ వే(కేబుల్‌ను పోల్‌పై తీసుకోవడానికి) అనుమతి కోసం కమిషనర్‌కు విన్నవించారు. ఆయన నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో గత నెల 25న హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ కేసును విచారించి ఈ నెల రెండుకు వాయిదా వేసింది. అయితే.. మునిసిపల్ లీగల్ అడ్వైజర్ ఆరో తేదీకి వాయిదా కోరారు.
అందుకు అనుగుణంగానే ఆదేశాలిచ్చింది. అయితే.. ఈలోపే ఈ నెల నాలుగున కేబుల్‌ను నగరపాలక సంస్థ ఉద్యోగులు కత్తిరించారు. దీనిపై సుదర్శన్ కమ్యూనికేషన్స్ న్యాయవాది హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు.. కమిషనర్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కమిషనర్ కూడా ధ్రువీకరించారు. మంగళవారం హైకోర్టుకు హాజరవుతామని, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పారు.