రైలు దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ
ఈస్ట్రన్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ నాయక్ వెల్లడి
విజయనగరం, న్యూస్‌లైన్: విజయనగరం జిల్లా గొట్లాం సమీపంలో జరిగిన రైలు దుర్ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఈస్ట్రన్ రైల్వే సేఫ్టీ ఆఫీసర్ (ఢిల్లీ) సుదర్శన్ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన ఘటనా స్థలాన్ని సందర్శించారు. బొకారొ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు వస్తున్నాయన్న వదంతులతో చైన్ లాగి కిందకి దిగిన కొందరు ప్రయాణికులను విజయవాడ-రాయగడ పాసింజర్ ఢీ కొనడంతో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనపై విచారణ నిమిత్తం విజయనగరం వచ్చిన సుదర్శన్ నాయక్ స్థానిక రైల్వే విశ్రాంతి భవనంలో విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంపై విచారణ కోసం ప్రత్యేక బృందం ఏర్పాటైందని, ఈ ఘటనకు సంబంధించిన కారణాలతో పాటు, ప్రత్యక్ష సాక్షుల కథనాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే కొంత సమాచారం సేకరించామని, వీడియో ఫుటేజీలు, ఫొటోల ఆధారంగా పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. క్షతగాత్రులను, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డివిజనల్ రైల్వే మేనేజర్ అనిల్‌కుమార్, సీనియర్ డీసీఎం యల్వేందర్ యాదవ్ పాల్గొన్నారు.