చిట్టి చిలకమ్మలు
మనిషికి దేవుడు మూడు వరాలిచ్చాడు.
నవ్వులు (కష్టాల డస్టర్లు)
పువ్వులు (ఆశల గుబాళింపులు)
గువ్వలు (కువకువల జీవనరాగాలు)
ఈ మూడు వరాలకు...
చక్కటి డ్రెస్ తొడిగితే?!
ఇదిగో... ఇలా...
ముద్దులొలికే చిట్టిచిలకమ్మలు.
చిన్నారిపొన్నారికిట్టమ్మలు.
పార్టీవేర్ అనగానే పిల్లలకు చాలామంది తల్లులు ఎంబ్రాయిడరీ, స్టోన్స్ డ్రెస్సులను ఎంపికచేస్తారు. కాని స్టోన్స్ గుచ్చుకోవడం, మెటీరియల్ చర్మానికి పడకపోవడం వంటివాటి వల్ల పిల్లలు అసౌకర్యానికి లోనవుతుంటారు. ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే...
అనువైన మెటీరియల్స్
చర్మానికి హాని చేయని కాటన్ అన్ని వేళలా శ్రేయస్కరం. అయితే పార్టీవేర్కు కాటన్ అంత సూటబుల్ కాదు. బ్రొకేడ్, రాసిల్క్, నెట్, షిఫాన్ మల్మల్... ఇలా ఏ క్లాత్‌తో డ్రెస్‌ను డిజైన్ చేయించినా లోపలి వైపు మెత్తగా ఉండే కాటన్‌ను లైనింగ్‌గా వాడాలి.
సింపుల్ డిజైన్స్ మేలు
ఆకర్షణీయంగా కనిపించాలి కదా అని మరీ గాడీ డిజైన్స్, ఒంటికి గుచ్చుకునేలా స్టోన్స్ ఉండకూడదు. తక్కువ స్టోన్ వర్క్‌ని ఎంచుకుంటూనే, ఆకర్షణీయంగా డిజైన్ చేయడం పట్ల దృష్టి పెట్టాలి. ఎంబ్రాయిడరీ, ఎలాస్టిక్ ఉన్న చోట కూడా కాటన్‌ను వాడటంశ్రేయస్కరం.
విడిగా శుభ్రత
పిల్లల దుస్తులను పెద్దవారి దుస్తుల్లో కలపకుండా విడిగా ఉతకాలి. ముఖ్యంగా పార్టీవేర్ డ్రెస్సుల శుభ్రత సున్నితంగా ఉండాలి. స్టోన్స్, ఎంబ్రాయిడరీ పాడవకుండా, రంగులు ఒకదానికొకటి కలిసిపోకుండా జాగ్రత్తపడాలి. పిల్లల బెడ్రూమ్లోనే ఒక పక్కన ‘లాండ్రీ బాస్కెట్’ అని పెట్టేస్తే వారు విడిచిన దుస్తులు ఒకే చోటే వేసేందుకు వీలుగా ఉంటుంది.
గుర్తించడానికి వీలుగా!
పిల్లల దుస్తులు వార్డ్‌రోబ్‌లో ఎంత శుభ్రంగా సర్దినా, తీసేటప్పుడు, తిరిగే సర్దేటప్పుడు అటూ ఇటూ అవుతుంటాయి. దీంతో కావలసిన సమయంలో మ్యాచింగ్ దొరక్క ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా డ్రెస్సులను లాగేటప్పుడు స్టోన్స్ పోవడం, చిరగడం వంటివి సంభవిస్తాయి. అందుకని ఒకే డ్రెస్‌కు సంబంధించిన దుస్తులను తేలిగ్గా తీసుకోవడానికి వీలుగా హ్యాంగర్స్‌కి వేయడం, దారంతో, లేదా పెయింట్‌తో లోపలివైపు గుర్తుగా చిన్న మార్క్ వేస్తే వెతుక్కునే పని సులువు అవుతుంది.
- నిర్వహణ: నిర్మలారెడ్డి
1 - బాందినీ నెట్ గాగ్రాకు కోరల్పింక్, రాయల్ బ్లూ కలర్ రాసిల్క్ బార్డర్ జతచేసి, క్రిస్టల్ స్టోన్ లైన్ ఇవ్వడంతో ఆకర్షణీయంగా మారింది. కోరల్ పింక్, రాయల్ బ్లూ రా సిల్క్ మెటీరియల్‌తో బ్లౌజ్‌ను డిజైన్ చేసి పైన క్రిస్టల్ స్టోన్స్, నెక్ దగ్గర గోల్డ్ బాల్స్ లైన్‌ను అమర్చడంతో డ్రెస్ మరింత కనువిందు చేస్తోంది.
2- బ్లూ, రెడ్, గ్రీన్ రా సిల్క్ మెటీరియల్‌తో డిజైన్ గాగ్రా చోలీ ఇది. లెహంగాకు రెడ్ రాసిల్క్ పైన గోల్డ్ లేస్‌లు ప్రత్యేకంగా కనువిందుచేస్తున్నాయి. మల్టీకలర్లో డిజైన్ చేసిన బ్లౌజ్ పైన కుందన్ వర్క్, షిఫాన్ చున్నీ ఆకట్టుకుంటున్నాయి.
3- ఫేడెడ్ నెట్ గాగ్రాకు రాసిల్క్, బ్రొకేడ్ క్లాత్ బార్డర్ పైన గోల్డ్ కలర్ లేస్ కుందన్ స్టోన్ డిజైన్ కంటికి ఆహ్లాదంగా కనిపిస్తోంది. మల్టీకలర్ బ్రొకేడ్ బ్లౌజ్ పైన కుందన్ వర్క్ హైలైట్‌గా నిలిచింది.
4- పీకాక్ గ్రీన్ గ్లాస్ టిష్యూ పావడాకు బ్లాక్ వెల్వెట్ బార్డర్‌ను జత చేయడంతో చూపులను కట్టిపడేస్తోం ది ఈ డ్రెస్. బ్లాక్ వెల్వెట్, బ్రొకేడ్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్ పైన కుందన్ వర్క్, క్రిస్టల్స్టోన్స్ ప్రత్యేకంగా కనువిందుచేస్తున్నాయి.
సుదీప,
కిడ్స్ ఫ్యాషన్ డిజైనర్
డ్రెస్కర్టెసి:
ఆలన బొటిక్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
e-mail: sudeepahyd1@ gmail.com