ముగ్గురు రైతులను మింగిన అప్పులు
సారంగాపూర్/భైంసా: అప్పుల బాధలు తాళలేక ముగ్గురు రైతులు ఆదివారం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామానికి చెందిన బట్టి సాయన్న(52) అనే కౌలు రైతుకు దిగుబడి సరిగా రాక రూ.3 లక్షల అప్పుల య్యాయి. అప్పు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్నాడు. భైంసా మండలం పేండ్‌పెల్లికి చెందిన రైతు దేశెట్టి ఆనంద్‌బాబు(42) బ్యాంకులో రూ.75వేలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.2.25 లక్షల అప్పులు చేశాడు. తీర్చలేక ఉరేసుకున్నాడు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం వెల్వర్తిలో కల్కూరి కిష్టయ్య అనే కౌలు రైతు వ్యవసాయ పెట్టుబడుల కోసం రూ.4.50లక్షల అప్పు చేశాడు. పంటలు చేతికందక అప్పులు మిగిలాయి. వాటిని తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.