మీరూ ప్రధానమంత్రికి సలహాలివ్వొచ్చు!
స్వాతంత్య్ర దినోత్సవం కోసం ప్రజలకు మోదీ విజ్ఞప్తి
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి సలహాలు ఇవ్వాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా ప్రధాని ఎర్రకోట నుంచి సందేశం ఇస్తారన్న విషయం తెలిసిందే. అయితే ప్రధాని మాట్లాడాల్సిన విషయాలను ప్రజలే చెప్పొచ్చు. ప్రభుత్వ వెబ్సైట్లలో తమ సలహాలను ఉంచొచ్చు. గతంలో ఏ ప్రధానమంత్రి చేయని విధంగా మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై ప్రజలను సలహాలను కోరడంతో కొత్త ట్రెండ్ సృష్టించినట్లయింది.
కిందటేడాది కూడా మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగానికి ప్రజల నుంచి సలహాలను కోరారు. www.mygov.in, www. narendramodi.in వెబ్సైట్లు, నరేంద్ర మోదీ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రజలు తమ సలహాలు పంపొచ్చు. ప్రజలు పంపిన మెసేజ్‌లన్నింటినీ ప్రధాని మోదీనే స్వయంగా చదువుతారని శిక్షణ, సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వైబ్సైట్లో పేర్కొంది. వాటిలో బాగున్న వాటిని ఎంపిక చేసి, ప్రధాని ప్రసంగ పాఠంలో చేర్చుకుంటారని తెలిపింది.