Suitcase body
-
భర్తను సూట్‌కేసులో దాక్కోమని చెప్పి ఊపిరి తీసింది..!
కొన్నిగంటలపాటు భర్తను సూట్‌కేసులో కుక్కి ఆయన చనిపోయేందుకు కారణమైన ఓ ఫ్లోరిడా మహిళను కోర్టు దోషిగా తేల్చింది. ఫ్లోరిడాలోని వింటర్పార్క్ అపార్ట్మెంట్లో సారా బూన్, భర్త జార్జ్ టోరెస్‌తో కలిసి ఉంటున్నారు. 2020లో టోరెస్ ఓ సూట్‌కేస్‌లో శవమై కనిపించాడు. అతని భార్య బూన్‌ను అనుమానించిన పోలీసులు ప్రశ్నించగా.. ‘ఇద్దరం మద్యం తాగి ఉన్నాం. ఆటలో భాగంగా అతను సూట్‌కేసులో దాక్కున్నాడు. అతని వేళ్లు బయటికి ఉన్న కారణంగా జిప్ తీసుకోగలడని భావించాను. నేను మేడపైకి వెళ్లి పడుకున్నా. నిద్రలేచి చూసే సరికి అతను ఇంకా సూట్‌కేసులోనే ఉన్నాడు. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది’ అని వెల్లడించింది. కేసు విచారణ నాలుగేళ్లపాటు కొనసాగింది. చివరికి బూన్ ఫోనే ఆమెను పట్టించింది. తనను సూట్‌కేసులోంచి తీయాలని టోరెస్ వేడుకుంటుండగా, తాను నవి్వన దృశ్యాలను బూన్ తన ఫోన్లో బంధించింది. అంతేకాదు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని, బయటికి తీయాలని టోరెస్ బతిమాలుతుండగా ‘నీకు దక్కాల్సింది అదే.. నన్ను మోసం చేసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. నేను కూడా గట్టిగా ఊపిరి పీల్చుకోలేకపోయాను’ అంటూ బూన్ సమాధానం ఇవ్వడం వీడియోలో రికార్డు అయ్యింది. దీంతో కోర్టు బూన్‌ను దోషిగా తేల్చింది. డిసెంబర్లో శిక్ష ఖరారు చేయనుంది. – వాషింగ్టన్ -
హత్య చేసి.. సాక్ష్యం లేకుండా.. తల మాయం!
ముంబై: మహారాష్ట్రలోని వాసాయి వెస్ట్‌లోని భూయ్ గావ్ బీచ్ సమీపంలో ఓ తలలేని మహిళ శవాన్ని పోలీసులు సోమవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. దుండగులు మహిళను హత్య చేసి, సాక్ష్యాలను మాయం చేయడానికి తలను మాయం చేసి సూట్‌కేసులో కుక్కి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు చాలా సున్నితమైనది కావడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముంబైలోని జేజే ఆసుపత్రికి పంపించినట్లు జోనల్ డిప్యూటీ కమిషనర్ సంజయ్ కుమార్ పాటిల్ తెలిపారు. ఆ మహిళ ఎవరనేది నిర్ధారించడానికి దర్యాప్తు బృందం ముంబై, పాల్ఘర్, థానే, నవీ ముంబైలోని పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల కోసం విచారణ ప్రారంభించింది. కాగా భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 302, 201 కింద వాసాయి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు కుమార్ పాటిల్ తెలిపారు. -
హత్య కేసులో మహిళకు యావజ్జీవం
కేకే.నగర్: ప్రియుడి కుమారుడిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసి సూట్‌కేసులో శవాన్ని తీసుకెళుతూ పట్టుబడిన పూవరసికి కింది కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను మద్రాసు హైకోర్టు సమర్థించింది. చెన్నై, విరుగంబాక్కం ఎంజీఆర్ నగర్‌కు చెందిన విజయకుమార్‌కు 2000 సంవత్సరం అనంతలక్ష్మి అనే యువతితో వివాహం జరిగింది. ఈ దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఆదిత్య ఉన్నాడు. జయకుమార్ చెన్నైలోని ప్రైవేటు సంస్థలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఇతనితో పాటు పనిచేసే పూవరిసిని జయకుమార్ ప్రేమించాడు. కొన్ని సంవత్సరాలు ఇద్దరూ సహజీవనం చేశారు. కుటుంబాన్ని వదిలి తనతో రమ్మని పూవరసి కోరిందని దానికి జయకుమార్ అంగీకరించలేదని తెలుస్తోంది. ఈ స్థితిలో మదురైలో పూవరసికి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జయకుమార్‌ను మదురైకు రమ్మని పిలిచింది. అతడు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన పూవరసి జయకుమార్ కుమారుడు ఆదిత్యను 2010 జులై 17న కిడ్నాప్ చేసింది. ఆమె బసచేసిన వైఎంసీఏ హోటల్లో ఆదిత్యను హత్య చేసి సూట్‌కేసులో పెట్టింది. తరువాత చిన్నారి మృతదేహాన్ని సూట్‌కేసు సహా నాగపట్టణం బస్సులో ఉంచి పారిపోయింది. ఆమెను చాకచక్యంగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తనను జయకుమార్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, అతడిపై పగ తీర్చుకోవడానికి అతడి కుమారుడు ఆదిత్యను హత్య చేశానని పోలీసులకు పూవరసి తెలిపింది. ఈ కేసుపై విచారణ జరిపిన చెన్నై ఆరవ అదనపు సెషన్స్ కోర్టు 2012లో పూవరసికి యావజ్జీవ శిక్ష విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పూవరసి తరఫున మద్రాసు హైకోర్టులో అప్పీలు చేశారు. ఈ హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తన నుంచి ఆదిత్యను వేరే వ్యక్తులు కిడ్నాప్ చేశారని, దీనిపై పోలీసులు సరిగ్గా విచారణ జరపలేదని, తనకు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేయాలని పూవరసి కోరింది. ఈ కేసు బుధవారం విచారణకు వచ్చింది. కేసు పరిశీలించిన న్యాయమూర్తులు పూవరసిపై కిడ్నాప్, హత్య నేరాలు రుజువుకావడంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పునిచ్చారు. కిడ్నాప్, హత్యకు కలిపి మరో యావజ్జీవాన్ని విధించి రెండు యావజ్జీవ శిక్షలను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు విధించిన జరిమానా రూ.లక్షను రూ.30 వేలకు తగ్గిస్తూ న్యాయమూర్తులు తీర్పునిచ్చారు.