నేడే తొలి స్నాతకోత్సవం
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తొలి స్నాతకోత్సవానికి తెలంగాణ యూనివర్సిటీ సిద్ధమైంది. ఇందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యూజీసీ మాజీ చైర్మన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సోషల్ సెన్సైస్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్‌దేవ్ తోరట్ పాల్గొననున్నారు.
ఏపీ యూనివర్సీటీస్ యాక్ట్ -1991 ప్రకారమే స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వీసీ అక్బర్ అలీఖాన్ తెలిపారు. 2.25 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 2.42 గంటలకు ముఖ్యఅతిథి సుఖ్‌దేవ్ తోరట్‌కు వర్సిటీ తరపున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తామన్నారు. 2.50 గంటలకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. 3.50 గంటలకు కార్యక్రమం ముగుస్తుందని తెలిపారు. కాగా 2006-07 నుంచి 2012-13 విద్యాసంవత్సరం వరకు ఆరు బ్యాచ్‌ల విద్యార్థులు పీజీ, బీఈడీ పూర్తి చేశారు. స్నాతకోత్సవానికి 1,497 మంది దరఖాస్తు చేసుకున్నారు.
విజయవంతం చేయాలని..
వర్సిటీ క్యాంపస్‌లోని కంప్యూటర్ అండ్ సైన్స్ భవనంలో స్నాతకోత్సవం నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాన్ని విజయవంత ం చేయాలని కోరుతూ రిజిస్ట్రార్ లింబాద్రి మంగళవారం తెయూ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. వేడుకల్లో పాల్గొనే విద్యార్థులు తెల్లని దుస్తులు ధరించాలని సూచించారు. స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయాలని తెయూ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ డెరైక్టర్ రాజారాం, అధ్యక్షుడు పంచరెడ్డి చరణ్, కార్యదర్శి సరిత, గౌరవాధ్యక్షుడు పుప్పాల రవి పిలుపునిచ్చారు.
స్నాతకోత్సవం నిర్వహించనున్న కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ భవనాన్ని మంగళవారం డిచ్పల్లి సీఐ శ్రీశైలం, ఎస్సై నరేశ్‌లు సందర్శించారు. బందోబస్తు ఏర్పాట్లపై వీసీ అక్బర్‌అలీఖాన్‌తో సీఐ, ఎస్సై చర్చించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
పదిహేను గోల్డ్‌మెడల్స్..
తెలంగాణ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో అత్యధిక మార్కులు సాధించినవారికి దాతల సహకారంతో గోల్డ్ మెడల్స్ అందించనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికోసం 15 మంది దాతలు ముందుకు వచ్చారని వర్సిటీ అధికారులు తెలిపారు. వీరు ఒక్కొక్కరు రూ. 2.10 లక్షల చొప్పున వర్సిటీకి విరాళంగా ఇచ్చారన్నారు. దాతలు సూచించిన సబ్జెక్టులో టాపర్‌కు ఏటా వారి పేరుతో గోల్డ్ మెడల్ ఇస్తామని పేర్కొన్నారు.
ఇద్దరికి రెండు చొప్పున
ఎంబీఏలో టాపర్‌కు గోల్డ్ మెడల్ ఇవ్వాలని ఇద్దరు దాతలు సూచించారని, దీంతో ఈ సబ్జెక్టులో టాపర్‌గా నిలిచిన సనా ఫిరదౌసికి రెండు గోల్డ్ మెడల్స్ అందించనున్నామని వర్సిటీ అధికారులు తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలోనూ ఇదే పరిస్థితి అని, దీంతో ఇందులో టాపర్‌గా నిలిచిన జువేరాకు రెండు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు.
పసిడి పతకాలు అందుకునేది వీరే
ఆర్ట్స్ విభాగంలో.. సయ్యద్ అమీనా మక్బూల్ (ఎంఏ ఉర్దూ)
సురంబ కుర్యాల (ఎంఏ తెలుగు)
సోషల్ సెన్స్ విభాగంలో.. బాసం త్రివేణి
(ఎంఏ మాస్ కమ్యూనికేషన్స్)
ఎస్.బాల్కిషన్ (ఎంఎస్‌డబ్ల్యూ)
రుహి షాజాజ్ (ఎంఏ ఎకనామిక్స్)
కామర్స్ విభాగంలో.. ఎన్.శ్వేత (ఎంకాం)
బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో.. సనా ఫిరదౌసి (ఎంబీఏ)
సైన్స్ విభాగంలో.. పి.అనూష (ఎంఎస్సీ బోటని)
తిరుపతిగారి నర్సింహారెడ్డి (ఎమ్మెస్సీ ఫిజిక్స్)
జువేరా (ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ)
కంప్యూటర్ సైన్స్ విభాగంలో.. కె.సంధ్యారాణి (ఎంసీఏ)
లా విభాగంలో.. ఫాతిమా బీ
బీఈడీ విభాగంలో... హనుమల్ల అర్చన