భారత్‌కు మూడో స్థానం
షూటౌట్లో కొరియాపై విజయం
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ
ఇఫో (మలేసియా): గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అత్యద్భుత ఆటతీరుతో భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో మూడో స్థానం పొందింది. కొత్త కోచ్ పాల్ వాన్ ఆస్ ఆధ్వర్యంలో తొలిసారిగా బరిలోకి దిగిన సర్దార్ సింగ్ సేన ఆదివారం కొరియాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో 4-1 తేడాతో నెగ్గి కాంస్య పతకం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 2-2తో సమంగా నిలిచాయి. నికిన్ తిమ్మయ్య పదో నిమిషంలోనే ఫీల్డ్ గోల్‌తో ఖాతా తెరిచాడు. అయితే ఆ వెంటనే యు హ్యోసిక్ (20) స్కోరును సమం చేశాడు.
దీంతో జోరు పెంచిన భారత్‌కు 22వ నిమిషంలో సత్బీర్ సింగ్ మరో ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యంలో ఉంచాడు. కానీ 29వ నిమిషంలోనే నామ్ హ్యూన్వూ చేసిన గోల్‌తో స్కోరు సమమైంది. ఆ తర్వాత ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యం కాగా.. భారత్ నుంచి ఆకాశ్‌దీప్, సర్దార్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, బీరేంద్ర లాక్రా గోల్స్ చేసి జట్టును గెలిపించారు. అటు కొరియా ప్రయత్నాలను కీపర్ శ్రీజేష్ రెండు సార్లు అడ్డుకున్నాడు. ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి న్యూజిలాండ్ విజేతగా నిలిచింది.