sulthanbazar
-
రాత్రి బైటకెళ్లిన భార్యాభర్తలకి చేదు అనుభవం
సుల్తాన్ బజార్: బంధువుల ఇంట్లో పూజకు వెళ్లి తిరిగొస్తున్న మహిళ పుస్తెలతాడును దుండగులు లాక్కెళ్లారు. సోమవారం సుల్తాన్ బజార్ పోలీసుల కథనం ప్రకారం... చిక్కడపల్లి జవహార్‌నగర్‌కు చెందిన మాధవి ఆమె భర్త రవికుమార్ ఆదివారం చంచల్గూడలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన పూజకు వెళ్లారు. రాత్రి 11.45కి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తుండగా కుద్బిగూడలో ముఖాలకు మాస్క్‌లు ధరించి ఉన్న ఇద్దరు దుండగులు వారిని బైక్‌పై వెంబడించారు. అదను చూసుకొని మాధవి మెడలో ఉన్న 3 తులాల పుస్తెలతాడును తెంచుకొని వేగం గా పారిపోయారు. బాధితులు అదే రోజు రాత్రి సుల్తాన్ బజార్ ఠాణాకు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటాం:జి.చెన్నయ్య
సుల్తాన్‌బజార్: ఎస్సీ వర్గీకరణను రాజ్యాంగబద్ధంగా అడ్డుకుంటామని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి.చెన్నయ్య తెలిపారు. హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ తేల్చి చెప్పినా... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎమ్మార్పీఎస్ నాయకులను వాడుకొని దళితులను చీల్చడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఉషా మెహ్రా కమిషన్ సూచించినట్లుగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక, పంజాబ్, హర్యానా, యూపీ, బీహార్లను కలుపుకొని ఒక కమిటీగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని తెలిపారు. త్వరలో ఢిల్లీలో ‘మాలల మహా ధర్మయుద్ధం’ సభను ఏర్పాటు చేసి వర్గీకరణకు మద్దతు తెలిపే అన్ని రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామన్నారు. ఈ సభలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మహిళలు, మేధావులు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ఢిల్లీ మాల మహానాడు అధ్యక్షులు సుధాకర్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గైని గంగాధర్, శ్రీను, రమేష్, వి. సుధాకర్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గద్దర్ మాలలకు ద్రోహం చేస్తున్నారు
సుల్తాన్‌బజార్: ప్రజా గాయకులు గద్దర్, కాకి మధవరావు, కోదండరామ్ ఒకే సామాజిక వర్గానికి కొమ్మకాస్తున్నారని వీరు మాలల ద్రోహులని మాల సంఘాల ఐక్యవేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఆవుల బాలనాథ్ అన్నారు. శనివారం కోఠిలోని సంఘం కార్యాలయంలో ఆగమయ్య, విజయ్‌బాబు, దాసరి భాస్కర్, మన్నేశ్రీరంగ, చెరుకు రామ్‌చందర్‌లతో కలిసి మాట్లాడారు. నిజాం లా కళాశాలలో శుక్రవారం జరిగిన సంఘటనలో మాదిగలే మాలలపై దాడి చేశారని, వారిపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ స్వార్ధం కోసమే మాల సామాజిక వర్గానికి చెందిన గద్దర్, కాకి మాధవరావు వర్గీకరణకు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. కాకి మాధవరావు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మాలలకు చేసిందేమీ లేదని, గద్దర్ కమ్యూనిస్టు భావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కొదండరామ్ వర్గీకరణకు మద్దతు పలకడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గద్దర్, కాకిమధవరావు ఇచ్చే వినతిని స్వీకరిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహిస్తుందని వారు హెచ్చరించారు. సమావేశంలో ప్రేమ్‌కుమార్, మోహన్, శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.