ఏసీబీ వలలో వైద్యాధికారి
శివరాంపల్లి: రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ సుధాకర్ సహా సీనియర్ అసిస్టెంట్ రమేష్ బుధవారం ఏసీబీకి పట్టుబడ్డారు. కామినేని లైఫ్ సర్వీసెస్ సంస్థ నిర్వాహకుడు డాక్టర్ సుమిద్ నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హయత్‌నగర్‌లో ‘కామినేని లైఫ్ సర్వీసెస్’ పేరుతో డాక్టర్ సుమిద్ రోగుల నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కనీస అర్హతలు లేకుండా రోగుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారని ఓ బాధితుడు 2013లో జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారు.
సదరు అధికారులు ఆ సంస్థను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు. కేసును ఉపసంహరించుకోవాలంటే డీఎంహెచ్‌వో నుంచి ఎన్ఓసీ తప్పనిసరి. అర్హత పత్రాలన్నీ చూపించినా కేసు ఉపసంహరణకు సంబంధించిన ఎన్ఓసీ ఇవ్వకపోగా.. బాధితుని నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. అందుకు ఆయన రూ.40 వేలు ఇచ్చేందుకు అంగీకరించారు. కన్సల్టెన్సీ బాధితుడు డాక్టర్ సుమిద్ మధ్యాహ్నం 12.30 గంటలకు శివరాంపల్లిలోని జిల్లావైద్యాధికార్యాలయంలోని డీఎంహెచ్‌వో సుధాకర్‌ను కలువగా, సీనియర్ అసిస్టెంట్ రమేష్‌ను కలువాల్సిందిగా సూచించాడు. దీంతో ఆయన రమేష్ వద్దకు వెళ్లి వెంట తెచ్చిన రూ.40 వేలు ఆయనకు ముట్టజెప్పగా, ఆయన వాటిని తీసుకుని డీఎంహెచ్‌వో సుధాకర్‌కు అప్పగిస్తుండగా, ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో పట్టుకున్నారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.