ప్రజలతో మమేకం
♦ తాళ్లపాలెంలో లోక్‌సభ స్పీకర్
♦ సుమిత్రా మహాజన్ పర్యటన
♦ రూ.53 లక్షల పనులకు ప్రారంభోత్సవం,శంకుస్థాపన
♦ ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
తెలుగులో ప్రసంగం
అందరికీ నమస్కారం అంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలుగులో ప్రసంగం ప్రారంభించారు. అనంతరం ఆంగ్లంలో ఆమె ప్రసంగాన్ని విశాఖ ఎంపీ హరిబాబు తెలుగులో అనువదించారు. సుమారు పావుగంట పాటు సాగిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములయి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. స్పీకర్ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనకాపల్లికి చెందిన బృందాలు ప్రదర్శించిన భరత నాట్యం అలరించింది. తప్పెటగుళ్లు ఆకట్టుకున్నాయి. మండల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు సభకు హాజరయ్యారు.
కశింకోట : లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మండలంలోని తాళ్లపాలెంలో వివిధ గ్రామా ల నుంచి వచ్చిన ప్రజలతో గురువారం మమేకమయ్యారు. వారి కష్ట,సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లలో కొప్పాక లక్క బొమ్మల ప్రదర్శనను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. పంచదార చిలుకలను పరిశీలించి పరవశించిపోయారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి పుస్తకంలో సంతకం చేశారు. ఉచిత వైద్య శిబిరం, నేత్ర వైద్య శిబిరాలు, వ్యవసాయ పరికరాల ప్రదర్శన, ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్య బోధనకు వినియోగించే ఉపకరణాల ప్రదర్శన పరిశీలించారు.
డ్వాక్రా, స్వయంసహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ చెక్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమెకు దుశ్శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు. బీజేపీ కార్యకర్తలతో కొద్దిసేపు ముచ్చటించారు. అంతకు ముందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొన్నగంటి అప్పారావు దంపతుల ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండలంలోని తాళ్లపాలెం పంచాయతీని అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు దత్తత తీసుకున్నారు. ఆయన ఆహ్వానం మేరకు లోక్సభస్పీకర్ గురువారం ఈ గ్రామంలో పర్యటించారు. రామాలయం వద్ద రూ.14.70 లక్షలతో మురికి కాలువలతో నిర్మించిన సిమెంటు రోడ్డును ప్రారంభించారు.
రూ.15 లక్షలతో తాళ్లపాలెంలోను, రూ. ఐదేసి లక్షలతో లాలంకొత్తూరు, రామన్నపాలెం, అచ్యుతాపురం, జి.భీమవరం గ్రామాల్లోను, రూ. 3 లక్షలతో తేగాడలో నిర్మించనున్న సామాజిక భవనాలకు శంకుస్థాపన చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అక్కడి నుంచి సభా వేదిక వరకు స్పీకర్‌కు విద్యార్థులు, మహిళలు గులాబీ పూలతో ఘనంగా స్వాగతం పరికారు. సభా కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు.
మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ యువరాజ్, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలా గోవిందసత్యనారాయణ, పంచకర్ల రమేష్‌బాబు తదితరులు ఆమెను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. మంత్రి గంటా ఆమెకు బెల్లం దిమ్మను బహూకరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ భవాని, జెడ్పీటీసీ సభ్యురాలు మలసాల ధనమ్మ, ఎంపీపీ పెంటకోట సుబ్బలక్ష్మి, సర్పంచ్ చెవ్వేటి గోవిందమ్మ, టీడీపీ నాయకుడు కాయల మురళీధర్, బీజేపీ నాయకుడు పొన్నగంటి అప్పారావు పాల్గొన్నారు.