విచారణ గాలికి..
– అంగడిలో ప్రశ్నపత్రాలు
– రోడ్లపై విద్యార్థుల చక్కర్లు
– అడ్డదారి తొక్కుతున్న యాజమాన్యం
– రిజిస్టర్లు పాటించని ప్రైవేట్ పాఠశాలలు
హిందూపురం అర్బన్ : సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు విద్యావిధానాన్నే అపహస్యంగా చేసేలా నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో 6వ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా జరిగిన ఉమ్మడి పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ముందుగానే జిరాక్స్ కేంద్రాల్లో ప్రత్యక్షమయ్యాయి. ‘ప్రశ్నపత్రాలు అమ్మబడును’ శీర్షికతో 28వ తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితమైంది. తర్వాత 29న తిరిగి ఇంగ్లిష్ పేపర్ లీక్ అయింది. దీనికి స్పందించిన డీఈఓ డివిజన్ విద్యాధికారులచే అన్ని పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించారు.
హెచ్చరికలకే పరిమితం
ప్రశ్నపత్రాలు పరీక్షల కంటే ముందుగా బహిర్గతమైనా అధికారులు తాపీగా పరీక్షలు కొనసాగించారు. బయటకు వచ్చిన ప్రశ్నపత్రాలు ఏ పాఠశాల నుంచి వచ్చాయని అంతు తేల్చాల్సిన అధికారులు హెచ్చరికలకే పరిమితమయ్యాయి. పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య, మిగిలిపోయిన ప్రశ్నపత్రాల వివరాలు రిజిస్టరులో నమోదు చేయాల్సి ఉన్నా అధికారులు అవేవీ పట్టించుకోలేదు. విద్యార్థుల్లోని నిజమైన ప్రతిభను వెలికి Sతీసేందుకు కషి చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ పరీక్షలు నిర్వహించడంలో నిబంధనలన్నీ గాలికొదిలేసింది.
చదువులు మానేసి రోడ్లపైకి..
సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు జరిగిన వారం రోజుల పాటు సాయంత్రం పూట విద్యార్థులు ఒక్కటే హడావుడి చేస్తున్నారు. ఫలానా చోట విద్యార్థికి ప్రశ్నపత్రం అందిందని తెలిసిన వెంటనే పరుగులు పెడుతున్నారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ చేసుకుని అందరూ పంచుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు మార్కుల కోసం నల్లబోర్డులపై రాతలు రాసి.. పుస్తకాల్లో గుర్తులు పెట్టి మరీ పరీక్షలు రాయించారు.