సమ్మర్ కేర్!
ఇంటిపంటలు..
జీవామృతం మొక్కలకు ‘సమ్మర్ టానిక్’
మార్చి వచ్చేసింది. ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఇంటిపంటల సాగుదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఎండబారిన పడకుండా చక్కని దిగుబడులు చేతికొస్తాయంటున్నారు శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ (83329 45368).
ఇంటిపంటలను ఎండ దెబ్బ నుంచి రక్షించుకోవాలంటే మొదట చేయాల్సిన పని షేడ్‌నెట్ వేసుకోవటమే. 70% సూర్యరశ్మిని వడకట్టి 30% ఎండను మాత్రమే మొక్కలకు అందించే షేడ్‌నెట్‌తో రక్షణ కల్పించడం ఉత్తమం. ఎండాకాలంలో మొక్కలకు పచ్చిపేడ లేదా పూర్తిగా ఎండని పశువుల ఎరువు వేయకూడదు. వీటిని వేస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ వేడి పుట్టి మొక్కలకు హాని కలుగుతుంది. అమ్మోనియా విడుదలవుతుంది (కూరగాయలు, ఆకుకూరలు అమ్మోనియా వాసనొస్తాయి). ఈ-కొలై బాక్టీరియా కొంతమేరకు విడుదలవుతుంది. కనీసం 6 నెలలు మాగిన పశువుల ఎరువు ఉత్తమం. ఒకసారి పూర్తిగా ఎండి.. తర్వాత తడిస్తే పర్వాలేదు.
కుండీలు / మడుల్లో అంగుళం లోతు మట్టిని పక్కకు తీసి.. పశువుల ఎరువు లేదా ఘనజీవామృతం తగిన మోతాదులో వేసి.. ఆ తర్వాత మట్టిని వేసుకోవాలి. మట్టిపైనే వేస్తే ఉపయోగం ఉండదు. ఎండ వేళల్లో మట్టిని కదిలించకూడదు.
కుండీలు, మడుల్లో పెరిగే మొక్కల చుట్టూతా మట్టిపై ఎండపడకుండా ఆచ్ఛాదన(మల్చింగ్) వేసుకోవాలి. ఇది పంటలను ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. ఎండుగడ్డి, ఎండాకులు, చిన్నాచితకా పుల్లలు, రెమ్మలు, ఎండిన పూలు.. ప్లాస్టిక్ కాని ఏ సేంద్రియ పదార్థాన్నయినా మల్చింగ్‌కు ఉపయోగించవచ్చు. కూరగాయ మొక్కల చుట్టూ వత్తుగా ఆకుకూరలు వేసుకోవచ్చు.
కుండీల్లో పెరిగే మొక్కలకు నేల మీద, మడుల్లో పెరిగే మొక్కలకన్నా ఎండ బెడద ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ కుండీలకన్నా మట్టి, సిమెంట్ కుండీలు ఉత్తమం. రోజుకు రెండుసార్లు తగుమాత్రంగా నీరు పోయాలి. డ్రిప్ వేసుకుంటే నీరు సద్వినియోగమవుతుంది.
మొక్కల వేసవి తాపాన్ని తగ్గించి, జీవశక్తినివ్వడంలో జీవామృతం పిచికారీ చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. వారం- పది రోజులకోసారి పిచికారీ చేయాలి. పత్రరంధ్రాల నుంచి తేమ ఎక్కువగా ఆవిరైపోకుండా జీవామృతం కాపాడుతుంది. అంతేకాదు.. మొక్కలకు బలవర్థకమైన సమ్మర్ టానిక్‌లా ఉపయోగపడుతుంది. వాతావరణ సంబంధిత వత్తిడిని తగ్గిస్తుంది. ఇంటిపంటలే కాదు పొలాల్లో పంటలపైనా పిచికారీ చేయొచ్చు.