‘సన్ టీవీకి అనుమతుల ప్రసక్తి లేదు’
న్యూఢిల్లీ: మారన్ కుటుంబ సభ్యులకు చెందిన సన్ టెలివిజన్ నెట్వర్క్కు భద్రతా అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర హోంశాఖ శనివారం స్పష్టంచేసింది. ఈ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అభ్యంతరాలను పక్కన పెట్టింది. సన్ టీవీకి 33 టీవీ చానళ్లు, ఒక ఎఫ్ఎం రేడియో ఉన్నాయి. ‘సన్ టీవీ యజమానులు చాలా నిబంధనలను ఉల్లంఘించారు. ఆ సంస్థలకు భద్రతా అనుమతులు ఇచ్చేందుకు చట్టంలో ఎలాంటి అవకాశమూ లేదు’ అని హోంశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
సన్ టీవీ అనుభవం నేపథ్యంలో.. ప్రైవేటు టెలివిజన్ సంస్థలకు లెసైన్సులు మంజూరు చేసే నిబంధనల్లో హోంశాఖ పలు మార్పులు చేసింది. వాటి ప్రకారం.. టీవీ చానళ్ల ప్రమోటర్లు, టెండరుదారులు.. తమపై ఎటువంటి క్రిమినల్, మనీ లాండరింగ్, ఉగ్రవాదులతో సంబంధాలు, ఆర్థిక మోసం వంటి కేసులేవీ పెండింగ్లో లేవని ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.