ఫస్ట్ లైవ్ బుక్
సన్‌బర్న్’... అంతర్జాతీయ స్థాయి సంగీతోత్సవం. మోడ్రన్ ఇండియా జోష్‌ను ప్రపంచానికి చూపిన సక్సెస్ఫుల్ ఈవెంట్. గోవాలో జరిగే ఈ ఇయర్లీ ఈవెంట్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఈవెంట్‌ని సిటీకి పరిచయం చేస్తున్న సందర్భంగా సన్‌బర్న్ కాన్సెప్ట్ సృష్టికర్త... బాలీవుడ్ నిర్మాత కూడా అయిన శైలేంద్రసింగ్ నగరానికి వచ్చారు. తన స్వీయానుభవాలతో రాసిన సన్‌బర్న్ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా సిటీప్లస్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...
భారత్‌లో చాలా మంది, చాలా ఘనత సాధించినప్పటికీ వాటిని పుస్తకాల్లోకి, రికార్డుల్లోకి తర్జుమా చేయటం గురించి ఆలోచించరు. విజయాలను, మార్పులను, గొప్ప విషయాలను రాబోయే తరాలకు అందించే ప్రయత్నం చేయరు. దీన్ని గమనించి... ప్రతి విజయానికీ అక్షర రూపం ఇవ్వడం అవసరమని గుర్తించాను. ది ట్రూ స్టోరీ ఆఫ్ సన్‌బర్న్ పుస్తకం అందులో భాగమే. నేడు సన్‌బర్న్ ఒక అంతర్జాతీయ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన విజయం. అయితే దీని వెనుక ఉన్న కథ గురించి నేను లేనప్పుడు ఎవరు మాట్లాడుకోరు. అందుకే నా కథ నేనే చెప్పాలని ఈ పుస్తకం రాశా.
డ్రీమ్ నుంచే ఫేమ్...
ఈ మధ్య యంగ్ జనరేషన్ కలలు కనడానికి కూడా సాహసించట్లేదు. నిజంగా ఒక కల కంటే దానిని సాకారం చేసుకోవటం అసాధ్యం కానే కాదు. పుస్తకాలు రాయడానికి నాకు ప్రత్యేక అర్హత లేదు కానీ రాయటం అవసర ం. నేను ఈ రోజు ఒక అంతర్జాతీయ గుర్తింపు పొందే రీతిలో ఒక పని చెయ్యగలుగుతున్నానంటే, అది మరెవరైనా చెయ్యగలరు. ఈ విషయాన్ని చదివి చాలా మంది స్ఫూర్తి పొందగలరు. వారి కలలకు వాస్తవ రూపం ఇవ్వగలరు.
చీకటి పడితే నిద్రపోవాలా?
సన్‌బర్న్ ఈవెంట్లు, బాలీవుడ్ సినిమాలు, చారిటీలు, అవేర్నెస్ క్యాంపైన్లు చేస్తూ కూడా మూడు పుస్తకాలు రాయడానికి సమయం ఎలా చిక్కిందంటే, చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నదే నా సమాధానం. పొద్దున నిద్రలేవాలి. రాత్రి నిద్ర పోవాలి. కచ్చితంగా ఇలాగే ఉండాలనుకుంటే ఏదీ చేయలేం. అలసిపోయినప్పుడు నిద్ర పోతే చాలదా! ఇలా ఆలోచిస్తే మీరూ ఎన్ని పనులైనా చేయవచ్చు. హైదరాబాద్‌కు రావడమంటే చాలా ఇష్టం. ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చేస్తుంటాను. నా మొదటి పుస్తకం ఫ్లాక్ నోస్ కూడా హైదరాబాద్‌లోనే లాంచ్ చేశా. మంచి గుర్తింపు వచ్చింది. అందుకే ఈ బుక్ ప్రీవ్యూ ఇక్కడే చెయ్యాలనిపించింది.
నెక్ట్స్ సబ్జెక్ట్..!
ఈ పుస్తకం తర్వాత మరో పుస్తకాన్ని కూడా లాంచ్ చేయబోతున్నా. అది సెక్స్ గురించిన పుస్తకం. 18 ఏళ్ల నా కొడుకుతో సెక్స్ గురించిన విషయాలు చెప్పాలనుకున్నా, చర్చించాల్సిన అవసరం ఉన్నా.. వాటిని మాటల్లో చెప్పలేను. కానీ చెప్పలేని ఎన్నో విషయాలను రాయవచ్చని ఇలా పుస్తక రూపంలో పెట్టా. ఈ పుస్తకం జనవరిలో లాంచ్ చేస్తున్నా.