డెంగీతో ఒకరి మృతి
నల్లమాడ, న్యూస్‌లైన్ : నల్లమాడలోని ఎస్సీ కాలనీకి చెందిన గంగయ్య (32) డెంగీ జ్వరంతో ఆదివారం మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు... గంగయ్య 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. నల్లమాడ, కదిరి ఆస్పత్రుల్లో చూపించుకున్నా తగ్గకపోవడంతో బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెంగీ జ్వరంతో బాధపడుతున్నాడని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ క్రమంలో ఆదివారం మృతి చెందాడు. కాలనీలో మరికొంత మంది కూడా డెంగీ జ్వరాల బారినపడ్డారు. వీరిలో గంగయ్య భార్య రాములమ్మతోపాటు రామలక్ష్మి, హేమంత్ ఆర్డీటీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మరో నలుగురైదుగురు నల్లమాడ తదితర ఆస్పతుల్లో చేరారు. డెంగీతో మృతి చెందినట్లు సమాచారం అందుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ హరికృష్ణ వెంటనే ఎస్సీ కాలనీలో పర్యటించారు. అపరిశుభ్రత పేరుకుపోవడం, మురుగు నీటి గుంతల్లో దోమలు విపరీతంగా ఉండడం ఆయన గమనించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు డాక్టర్ హరికృష్ణ వద్ద తమ గోడు వెల్లబోసుకున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా పాలకులు గానీ, అధికారులు గానీ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ కాలనీలో డెంగీ జ్వరాలు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి పట్టడం లేదని విమర్శించారు. కాలనీలో తక్షణమే వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాలను అదుపులోకి తేవాలని డిమాండ్ చేశారు. పారిశుధ్యం మెరుగునకు చర్యలు తీసుకోవాలని కోరారు.