sunin law
-
ఇంటికి కన్నం వేసింది అల్లుడే
బుచ్చెయ్యపేట(చోడవరం): మండలంలో రాజాం గ్రామంలో ఓ ఇంటిలో ఆ ఇంటి అల్లుడే చోరీకి పాల్పడ్డాడు. బుచ్చెయ్యపేట ఎస్ఐ ఎ.విజయ్‌కుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాజాం గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ గుర్రం నాగమణి గత నెల 23న అమ్మగారి ఊరైన వడ్డాదిలో జరిగే శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది. తిరిగి ఈ నెల ఒకటో తేదీ సాయంత్రం రాజాంలో ఇంటికి రాగా ఇంటిలో బీరువా తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్టు గుర్తించింది. బీరువాలో భద్రపరిచిన ఐదున్నర తులాల బంగారం, పది తులాల వెండి వస్తువుల చోరీ అయినట్టు బుచ్చెయ్యపేట పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. క్లూసు టీం,డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా ఆదివారం ఉదయం బంగారుమెట్టలో ఉన్న నాగమణి అల్లుడు మేరుగు గణేష్ ఇంటికి వెళ్తుండగా అతను పోలీసులను చూసి పరారయ్యేందుకు యత్నించాడు. అతనిని పట్టుకుని విచారించారు. చేసిన అప్పులు తీర్చడానికి తానే అత్తారింట్లో దొంగతనం చేసినట్టు గణేష్ అంగీకరించినట్టు ఎస్ఐ తెలిపారు. చెడు అలవాట్ల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు అత్తవారింటిలో గణేష్ దొంగతనం చేసినట్టు తమ విచారణలో తేలిందని ఎస్ఐ చెప్పారు. నింది తుని వద్ద నుంచి ఐదున్నర తులాల బంగారు నక్లీస్,చైన్,చెవి దుద్దులు,ఉంగరాలతో పాటు పది తులాల వెండి వస్తువులను స్వాధీనం చేసికుని కోర్టుకు తరలించామన్నారు. దొంగతనం జరిగిన పది రోజుల్లోనే కేసును ఛేదించామన్నారు. -
చిరు అల్లుడు విజేత
చిరంజీవి నటించిన ‘విజేత’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 1985లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు అదే టైటిల్‌ని చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రానికి పెట్టడం విశేషం. రాకేశ్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి వారాహి సంస్థలో రజినీ కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘విజేత’ టైటిల్ అనౌన్స్ చేశారు. ‘లైటింగ్ అప్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ సక్సెస్’ అనేది ట్యాగ్ లైన్.(ఇతరుల ముఖాల్లో వెలుగు చూడటం కూడా విజయమే అని అర్థం). ఇందులో మాళవికా నాయర్ కథానాయిక. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘బాహుబలి’ ఫేమ్ సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. నాజర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, ‘సత్యం’ రాజేష్, ప్రగతి, కల్యాణీ నటరాజన్, పోసాని, రాజీవ్ కనకాల, జయప్రకాశ్ (తమిళ్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్. -
అల్లుడు.. డబ్బింగ్ షురూ
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతోన్న విషయం తెలిసిందే. ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వంలో సాయి కొర్రపాటి నిర్మాణ సారథ్యంలో రజిని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కల్యాణ్ దేవ్ గురువారం డబ్బింగ్ ప్రారంభించారు. దర్శక–నిర్మాత మాట్లాడుతూ– ‘‘ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘బాహుబలి’ కెమెరామ్యాన్ సెంథిల్ కుమార్ మా చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించారు. ‘రంగస్థలం’ చిత్రంతో కళా దర్శకుడిగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ మా సినిమాకి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ చక్కటి సంగీతం సమకూర్చారు. త్వరలో టైటిల్, రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాని. -
అత్తింటి వారిపై అల్లుడు దాడి: ఇద్దరి మృతి
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యను కాపురానికి పంపడం లేదని ఆగ్రహించిన అల్లుడు అత్తింటిపై దాడి చేసి ఇద్దరిని హతమార్చాడు. ఈ సంఘటన నిజామాబాద్ మండలం సారంగాపూర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శివమ్మకు నర్సింహులుతో నాలుగేళ్ల క్రితం పెళ్లైంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో.. శివమ్మ తల్లిగారింట్లో ఉంటుంది. పలుమార్లు కాపురానికి రమ్మని నర్సింహులు కోరినా ఆమె నిరాకరించింది. దీంతో అత్తింటి వారిపై కక్ష పెంచుకున్న అల్లుడు నర్సింహులు ఆదివారం తెల్లవారుజామున అందరు నిద్రిస్తున్న సమయంలో కత్తితో ఇంట్లోకి ప్రవేశించి భార్యపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె తప్పించుకుంది. ఇది గమనించిన ఆమె సోదరుడు సాయిలు(28) నర్సింహులును అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. అడ్డొచ్చిన అతని భార్య సుశీల(26)ను కూడా కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డువచ్చిన అత్త లక్ష్మి(50), మామ(55)ల పై కూడా దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు నర్సింహులును పట్టుకోవడానికి ప్రయత్నించగా.. అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.