గుంతకల్లులో 'సూది సైకోలు'
గుంతకల్లు: హైదరాబాద్, శ్రీకాకుళం, గుంటూరు ప్రాంతాల్లో సంచలనం సృష్టిస్తున్న సూది సైకోలు అనంతపురం జిల్లా గుంతకల్లులో సోమవారం ప్రత్యక్షమయ్యారు. ఇద్దరు అపరిచిత వ్యక్తులు రెడ్ పల్సర్ వాహనంపై ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని హెల్త్‌కేర్ ప్రైవేటు క్లినిక్ సమీపాన నిర్మాణంలో ఉన్న భవనం వద్ద తచ్చాడుతూ కనిపించారు. అటువైపుగా వెళ్లిన వెంకటేష్, సుంకన్నలు అపరిచిత వ్యక్తులను గుర్తించి ఎవరు మీరు? ఏ ఊరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. అపరిచిత వ్యక్తుల చేతుల్లోని సిరంజీలు (సూదిమందు) చూసి అవాక్కయ్యారు. సూది సైకోలు అనే అనుమానంతో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ద్విచక్ర వాహనంలో పారిపోయారని చెప్పారు.
కొద్ది దూరం వరకు వెంబడించినా ప్రయోజనం లేకపోయిందని వెంకటేష్, సుంకన్నలు తెలిపారు. సూది సైకోలు ద్విచక్ర వాహనంలో ఉరవకొండ పట్టణం వైపు పరుగులు పెట్టారని, ద్విచక్ర వాహనం నంబరుఏపీ21యూ (కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్ కల్గిన వాహనం) మాత్రమే గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు. అపరిచిత వ్యక్తులు స్టే చేసిన భవనం వద్ద పడి ఉన్న మందు కలిపిన ఖాళీ ప్లాస్టిక్ గ్లాస్‌ను చూసి స్థానికులు భయాందోళన చెందారు. పారిపోయింది సూది సైకోలా? లేదా హెరైన్, ఇతరత్ర మత్తు మందు బానిసలా? అనే అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.