నరకయాతన
కర్నూలు (హాస్పిటల్), న్యూస్‌లైన్ : కర్నూలు సర్వజనాస్పత్రిలో ‘అనంత’ క్షతగాత్రుల హాహాకారాలు.. వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వేసవి సెలవుల్లో స్వగ్రామానికి వచ్చి ప్రమాదానికి గురైన వారు కొందరైతే.. ప్రతి ఏటా జాతరకు వచ్చి మొక్కులు తీర్చుకునే వారు మరికొందరు. విషాదం నింపిన సుంకులమ్మ తిరుణాల ఘటనలో తీవ్రంగా గాయపడిన వారు నరకయాతన అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లిలో శుక్రవారం రాత్రి సుంకులమ్మ బండి శిల తిరుణాల సందర్భంగా శిడిబండి లాగుతుండగా విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాత పడగా.. మూడు ఎద్దులు చనిపోయాయి. శుక్రవారం రాత్రి గుత్తి ప్రభుత్వాసుపత్రి నుంచి 16 మందిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకొచ్చారు. వీరిలో ఇద్దరిని ప్రైవేటు ఆసుపత్రులకు, 14 మంది ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. క్యాజువాలిటీలో ప్రథమ చికిత్స అనంతరం శనివారం తెల్లవారుజామున వీరిని కాలిన రోగుల వార్డుకు మార్చారు. రామరాజుపల్లెకు చెందిన పరమేశ్వరాచారి కుమారుడు మాణిక్యాచారి(18), వెంకటరెడ్డి కుమారుడు పి.సుదర్శన్‌రెడ్డి (16), పెద్దవడుగూరుకు చెందిన బాబయ్య కుమారుడు డి.వన్నూరువలి (12), పెద్దవడుగూరు మండలం కాశేపల్లి గ్రామానికి చెందిన చెన్నారెడ్డి కుమారుడు జి.సుమంత్‌రెడ్డి(7), యాడికి మండలం రాయలచెరువు గ్రామానికి చెందిన ఎస్.వెంకటనారాయణరెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌రెడ్డి (20)కి 80 నుంచి 90 శాతం శరీరం కాలిపోవడంతో వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
పెద్దవడుగూరుకు చెందిన బాలిరెడ్డి కుమారుడు బాబురెడ్డి(45)కి ఐదు శాతం, ఆదిరెడ్డి కుమారుడు కె.లక్ష్మినారాయణరెడ్డి(35)కు 20 శాతం, రామరాజుపల్లె గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి కుమారుడు సుధాకర్‌రెడ్డి(20)కి 40 శాతం, మడమకులపల్లికి చెందిన శ్రీరామిరెడ్డి(35)కి 20 శాతం, పెద్దవడుగూరు మండలం కాసిపల్లె గ్రామానికి చెందిన చెన్నారెడ్డి కుమారుడు జి.ప్రభాకర్‌రెడ్డి(15)కు 20 శాతం, అనంతపురంలోని హెచ్ఎల్సీ కాలనీకి చెందిన వి.ప్రవీణ్‌కుమార్(18)కు 30 శాతం, పెద్దవడుగూరుకు చెందిన ఆదినారాయణ కుమారుడు సత్యనారాయణ(35)కు 40 శాతం, చెన్నారెడ్డి కుమారుడు జి.సుధీర్‌రెడ్డి(10), రంగనాయకులు కుమారుడు రామచంద్ర(25)కు 40 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న 14 మందిలో నలుగురిని శనివారం కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో 10 మంది, ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు.