లీలా కావడం చాలా కష్టమైంది: సన్నీ లియోన్
బాబీఖాన్ తీస్తున్న 'ఏక్ పహేలీ లీలా' సినిమాలో వేర్వేరు అవతారాలు పోషిస్తున్న సన్నీలియోన్.. చాలా కష్టపడుతోంది. తనకు అందులో లీలా పాత్ర పోషించడం, ఆ పాత్రలోకి వెళ్లిపోవడం చాలా కష్టం అవుతోందని తెలిపింది. సినిమా ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో ఆమె పాల్గొంది. ఇది చాలా ఛాలెంజింగ్ పాత్ర అని, స్క్రిప్టు చూడగానే అది తనకు బాగా నచ్చిందని చెప్పింది. అయితే.. లీలాగా మారడానికి మాత్రం తనకు కనీసం 2-3 గంటల సమయం పడుతోందని తెలిపింది.
తొలిరోజు అయితే.. తన లుక్ పూర్తిగా నిర్ణయించుకోడానికి 6 గంటల సమయం పట్టిందని చెప్పింది. అయితే, తన టీంలో చాలామంది నుంచి కావల్సినంత మద్దతు లభించిందని, లీలా పాత్రకు డైలాగులు చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది అయ్యిందని సన్నీ అంటోంది. చాలా కష్టపడి అవన్నీ నేర్చుకున్నానని, అది ప్రేక్షకులకు బాగా ఎక్కుతుందని అంటోంది. ఈ సినిమాలో జయ్ భానుశాలి, రజనీష్ దుగ్గల్, రాహుల్ దేవ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.