సూపర్ బ్యాటరీ తయారు చేసిన సోనీ
స్మార్ట్ ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో వినియోగదారుల అవసరాల మేరకు శక్తిమంతమైన బ్యాటరీల తయారీ మొబైల్‌ఫోన్ కంపెనీలకు కష్టంగా మారింది. ఫోన్లలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన కారణంగా ఒక రోజుకు సరిపడ బ్యాటరీ చార్జింగ్ ఉంచడం కష్ట సాధ్యమే అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ సోనీ కొత్త సూపర్ బ్యాటరీని తయారుచేసినట్లు వెల్లడించింది.
సాంప్రదాయ లిథియం అయాన్ బ్యాటరీల కంటే 40 శాతం ఎక్కువ శక్తిని ఈ బ్యాటరీలో నిల్వచేసే అవకాశం ఉన్నట్లు సోనీ ప్రకటించింది. ఈ బ్యాటరీల తయారీలో లిథియం- సల్ఫర్, మెగ్నీషియం-సల్ఫర్ మూలకాలను వాడినట్లు తెలిపింది. కొత్త విధానం ద్వారా బ్యాటరీలో తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని నిల్వచేసే అవకాశం ఉందని తెలిపిన సోనీ... ఇవి పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రావాలంటే మాత్రం 2020 వరకు ఆగాల్సిందే అని చెబుతోంది. గతంలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కూడా సోనీ సంస్థ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.