వాజ్‌పేయిని పెళ్లి చేసుకుంటా..
భారత రాజకీయ ప్రస్థానంలో ఒక ధృవతార రాలిపోయింది. రాజకీయ విలువలను ఉన్నతీకరించిన రాజనీతిజ్ఞులలో అగ్రగణ్యుడు అటల్ బీహారీ వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. ఆయన మరణంతో ఆర్ఎస్సెస్, బీజేపీ శ్రేణులతో పాటు యావత్ దేశం శోక సంద్రంలో మునిగిపోయింది. అజాత శత్రువు, అభినవ భీష్ముడిగా పేరుగాంచిన అటల్జీకి ఉమ్మడి వరంగల్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది.. నాడు అటల్జీతో కలిసి పనిచేసిన నాయకులు.. ఆ అగ్రనేత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
హన్మకొండ/గూడూరు/సాక్షి మహబూబాబాద్/ పరకాల: భారత దేశ మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జనసంఘ్ నాయకుడిగా, జనతా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా ఎన్నికల ప్రచారంలో, బీజేపీ స్థాపించిన అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో జిల్లాలో పలుమార్లు పర్యటించారు. జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డికి అటల్జీతో సత్సంబంధాలున్నాయి. 1984లో పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఇద్దరు బీజేపీ నుంచి లోక్‌సభకు ఎన్నిక కాగా ఇందులో హన్మకొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి చందుపట్ల జంగారెడ్డి, మెహసానా నియోజకవర్గం నుంచి అటల్జీ విజయం సాధించారు. పార్టీ సీనియర్ నాయకులు తెలిపిన ప్రకారం ఉమ్మడి జిల్లాకు అటల్జీ అయిదు సార్లు వచ్చారు.
జనసంఘ్ నాయకుడిగా 1964లో వరంగల్‌కు వచ్చి పాత బీట్ బజార్లో జరిగిన పార్టీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. 1968లోనూ జనసంఘ్ నాయకుడిగా హన్మకొండ ప్రస్తుత అశోక టాకీస్ ప్రాంతంలో అప్పటి జీవన్‌లాల్ మైదానంలో జరిగిన సభలో ప్రసంగించారు. 1978లో జనతా పార్టీలో కొనసాగుతుండగా.. అప్పటి ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి శాసన సభ స్థానానికి పోటీ చేసిన స్వాతంత్య్ర సమరయోదుడు భూపతి కృష్ణమూర్తి గెలుపు కోసం ప్రచారం చేసేందుకు విదేశాంగ మంత్రిగా ఉన్న వాజ్‌పేయి వరంగల్‌కు వచ్చారు. బీజేపీ ఆవిర్భావం తరువాత 1984లో వరంగల్‌లోని ఏకశిల హోటల్లో రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో హాజరయ్యారు.
రెండు రోజులు ఇక్కడే ఉండి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్ధేశం చేశారు. వర్థన్నపేటలో పార్టీ అభ్యర్థి వన్నాల శ్రీరాములు గెలుపుకోసం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 1987లో హన్మకొండ నక్కలగుట్టలో జరిగిన భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర మహాసభలకు హాజరయ్యారు. ఆ సమయంలో పార్టీ దివంగత నేత ప్రమోద్ మహాజన్.. యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా, వాజ్‌పేయితో కలిసి వచ్చారు. ఆ సమయంలో బాలసముద్రంలోని పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మాదవపెద్ది రాఘవరెడ్డి బంధువు విమలాదేవి ఇంటిలో విశ్రాంతి తీసుకున్నారు.
మానుకోటకు మూడు సార్లు..
1989లో బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న మాదవపెద్ది రాఘవరెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపితే దశదినకర్మలో పాల్గొనేందుకు మహబూబాబాద్ వరకు రైలులో వచ్చారు. ఇక్కడ నుంచి గూడూరు మండలంలోని గోవిందపూర్ వెళ్లి రాఘవరెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాఘవరెడ్డికి నివాళులర్పించారు. అక్కడి నుంచి వరంగల్‌కు చేరుకుని వరంగల్ ఇస్లామి యా కాలేజీ మైదానంలో జరిగిన రాఘవరెడ్డి సం తాప సభలో పాల్గొని ప్రసంగించారు. చివరగా 1991లో జరిగిన ఎన్నికల సందర్భంగా మరోసారి జిల్లాలో పర్యటించారు.జనగామ,పరకాల,వరంగల్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
సూపర్కిడ్కు ప్రశంసలు
జనగామ జిల్లాకు చెందిన మహ్మద్ ఫయాజొద్దీన్, అమీనాబేగం కూతురు బీబీఫాతిమా.. ప్రధానిగా ఉన్న సమయంలో వాజ్‌పేయిని కలుసుకున్నారు. రెండేళ్ల వయస్సులో వరల్డ్ సూపర్ కిడ్‌గా గుర్తింపు పొందిన చిన్నారి బీబీ ఫాతిమాను.. మీడియా ప్రశ్నించగా..వాజ్‌పేయిని పెళ్లి చేసుకుంటానని అనడంతో జాతీయస్థాయిలో చర్చ జరిగింది. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న చెన్నమనేని విద్యాసాగర్.. బీబీఫాతిమాను వాజ్‌పేయి వద్దకు తీసుకువెళ్లగా.. ఆప్యాయతతో పలకరించి బహుమతి అందించారు. వాజ్‌పేయి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
ఏకశిల హోటల్ ప్రారంభం
హన్మకొండ కల్చరల్ : వాజ్‌పేయి విదేశాంగమంత్రిగా పనిచేసిన కాలంలో 1978లో తెలంగా ణలోనే అతిపెద్ద హోటల్(త్రీస్టార్ హోటల్)గా నిర్మాణమైన ఏకశిలహోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు.
అటల్జీ.. ఒక స్ఫూర్తి ప్రదాత డిప్యూటీ సీఎం కడియం సంతాపం
వరంగల్ రూరల్ : ఈ తరం రాజకీయాలకు అటల్ బీహారీ వాజ్‌పేయ్ ఒక స్ఫూర్తి ప్రధాత అని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. అటల్జీ మృతికి ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి వాజ్‌పేయ్ అని ఆయన కొనియాడారు. సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి స్కూల్ డ్రాప్‌అవుట్స్‌ను తగ్గించడానికి కృషిచేసిన ప్రధానమంత్రిగా ఎప్పటికీ అటల్జీ ప్రజల హృదయాల్లో నిలిచి పోతారన్నారు. భారత మాజీ ప్రధాని అటల్జీ మృతిపట్ల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రత్యామ్నాయ రాజకీయాలకు నాంది పలికారు
మాజీ ప్రధాని అటల్జీ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థకు నాంది పలికారు. వివిధ రాజకీయ పార్టీలను ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక పోషించారు. ప్రధానిగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. పేదల అభ్యున్నతికి కృషి చేశారు. వాజ్‌పేయి మృతి దేశానికే తీరని లోటు.
– డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు