రంగంలోకి మద్యం మాఫియా !
కామారెడ్డి: జిల్లాలో మొత్తం 130 మద్యం దుకాణాలకు ఈ నెల 21 లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో నిజామాబాద్ సూపరింటెండెంట్ పరిధిలో 93 దుకాణాలు, కామారెడ్డి సూపరింటెండెంట్ పరిధిలో 37 దుకాణాలున్నాయి. 2014-15 సంవత్సరానికి గాను ఫిక్స్డ్ లెసైన్స్ పద్ధతిపై దుకాణాలను లాటరీ పద్ధతిన కేటాయించనున్నారు. దీంతో ఇప్పటికే రంగంలోకి దిగిన మద్యం మాఫియా జిల్లాలో ముఖ్యమైన దుకాణాలపై దృష్టి సారించినట్టు సమాచారం.
ఎక్కువగా అమ్మకాలు సాగే దుకాణాలను కైవసం చేసుకునేందుకు గాను ఆయా దుకాణాలపై తమకు సంబంధించిన వ్యక్తుల ద్వారా అత్యధిక టెండర్లు వేయించడానికి రంగం సిద్ధం చేసుకుని పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మద్యం మాఫియాకు చెందిన కొందరు జిల్లాలోని పలు దుకాణాలకు సంబంధించి ఆయా ప్రాంతాలకు చెందిన వారితో మంతనాలు జరిపారని సమాచారం.
ఎవరికీ దక్కినా తమ వాటా ఉండాలని ఒప్పందం
గతంలో జిల్లాలో మద్యం దుకాణాలను సొంతం చేసుకుని అధిక ధరలకు మద్యం అమ్మకాలు సాగించిన వ్యాపారులు ఈ సారి కూడా దుకాణాలు సొంతం చేసుకోవడానికి ఎత్తులు వేస్తున్నారు. కొన్ని దుకాణాలకు ఎక్కువ సంఖ్యలో టెండర్లు దాఖలయ్యే అవకాశం ఉండడంతో ఎవరికీ దక్కినా తమ గ్రూపునకు వాటా ఉండాలనే ఒప్పందాలకు వస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జిల్లాలో మద్యం అమ్మకాల విషయంలో మాఫియా చెప్పిందే నడిచింది. అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ వెంకటరమణారెడ్డి మద్యం మాఫియాపై పెద్ద పోరాటమే చేశారు.
తరువాత మద్యం దుకాణాల కేటాయింపునకు డ్రా పద్ధతి రావడంతో మాఫియా కు ఎక్కువ దుకాణాలు దక్కలేదు. రెండు సంవత్సరాలుగా వెనకడుగు వేసిన మద్యం మాఫి యా ఇప్పుడు మళ్లీ అడుగులు ముందుకు వేస్తోంది. ఈ సారి డ్రాలో ఎక్కువగా దుకాణాలు పొందడం ద్వారా తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. మరి మద్యం మాఫియా ఎత్తులు ఏమేరకు విజయవంతం అవుతాయో వేచిచూడాలి.