నీరుగార్చారు..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కురవక కురవక భారీ వర్షం కురిసినా దుర్భిక్ష ‘అనంత’ నుదుటిరాత మారడం లేదు. సప్లయ్ చానళ్లు, ఫీడర్ చానళ్లు అస్తవ్యస్తంగా ఉండటం.. చెరువు కట్టలు బలహీనంగా మారడం.. తూములు మరమ్మతుకు నోచుకోకపోవడం వల్ల చెరువులు నిండలేదు. చిన్న నీటి పారుదల వ్యవస్థపై సర్కారు నిర్లక్ష్యం ఫలితంగా వర్షపు నీళ్లు వ ృథా అవుతున్నాయి.
పతి వర్షపు నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవడానికి చిన్న నీటిపారుదల వ్యవస్థను అభివ ృద్ధి చేస్తామని రెండేళ్ల క్రితం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ సర్వేలోనే తెల్లారిపోయింది. పోనీ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంజూరైన ట్రిపుల్ ఆర్ పథకం నిధులైనా సద్వినియోగం చేసుకున్నారా అంటే అదీ లేదు. ట్రిపుల్ ఆర్ కింద చేపట్టే పనులను నామినేషన్ పద్ధతిలో తమ అనుచరులకే ఇవ్వాలని అధికార ప్రజాప్రతినిధులు పట్టుపట్టడంతో ఆ పనులు కూడా నిలిచిపోయాయి. ఫలితంగా సమృద్ధిగా వర్షం కురిసినా అధిక శాతం చెరువులు నిండలేదు.
జిల్లాలో 1,373 చెరువులు, 2,094 కుంటలను రాజుల కాలంలో తవ్వించారు. ఈ చెరువుల కింద 1,37,640 ఎకరాలు, కుంటల కింద 21,094 ఆయకట్టు ఉంది. రాజుల కాలంలో నిర్మించిన చెరువులు, కుంటలు ఇప్పుడు శిథిలావస్థకు చేరుకున్నాయి. నీటి పారుదల వ్యవస్థ( ఫీడర్, సప్లయ్ చానల్స్) అస్తవ్యస్తంగా మారడం, చెరువు తూములు, కట్టలు శిథిలావస్థకు చేరడం వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసినా.. చెరువుల్లోకి నీళ్లు చేరడం లేదు. ఫలితంగా 1.58 లక్షల ఆయకట్టు బంజరుగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 9, 2011న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో పర్యటించినపుడు.. ‘అనంత’ను సుభిక్షం చేయడానికి చెరువులను అనుసంధానిస్తామని హామీ ఇచ్చారు. భూగర్భ జలాలను సంరక్షించడానికి వీలుగా ఊట చెరువులు, చెక్‌డ్యాంలు నిర్మిస్తామని చెప్పారు. ఇందుకు సర్వే చేయడానికి మాత్రమే రూ.5 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సర్వే బాధ్యతలను ఓ సంస్థకు అప్పగించి.. మూడు నాలుగు నెలల్లో సర్వేను పూర్తి చేయిస్తామని చెప్పారు. ఆ తర్వాత పనులను ప్రారంభిస్తామని సెలవిచ్చారు. కానీ.. ఇప్పటికీ కనీసం సర్వేకు ఇస్తామన్న రూ.ఐదు కోట్లను కూడా విడుదల చేయనే లేదు. దీంతో రెండేళ్లుగా సర్వే ప్రక్రియే ప్రారంభం కాలేదు. పోనీ.. అందుబాటులో ఉన్న నిధులనైనా వినియోగించుకున్నారా అంటే అదీ లేదు. జిల్లాలో చిన్న నీటి పారుదల వ్యవస్థ దుస్థితిని గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెరువుల అభివ ృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులను మంజూరు చేయించారు.
టిఫుల్ ఆర్(రిపేర్స్-మరమ్మతులు, రెన్నోవేషన్-పునరుద్ధరించడం, రీకన్స్ట్రక్షన్- పునర్నిర్మించడం) పథకం కింద జిల్లాలో చెరువుల అభివ ృద్ధికి రూ.90 కోట్లను ప్రపంచ బ్యాంకు 2009లో కేటాయించింది. ఈ నిధులను మూడేళ్లలోగా వినియోగించుకోవాలని షరతు పెట్టింది. ప్రపంచ బ్యాంకు షరతుల నేపథ్యంలో చిన్న నీటి పారుదల శాఖలో సిబ్బంది కొరత రీత్యా ఎస్టిమేట్లు తయారు చేయడం ఆలస్యమవుతుందని భావించిన ప్రభుత్వం.. ఆ బాధ్యతను హైదరాబాద్‌కు చెందిన విజన్ ల్యాబ్స్ అనే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్ల విజన్ ల్యాబ్స్ సంస్థ సకాలంలో ఎస్టిమేట్లను అందించలేకపోయింది.
అందుబాటులో ఉన్న ఎస్టిమేట్లతో రూ.34.50 కోట్లతో 104 పనులు చేపట్టేందుకు చిన్న నీటి పారుదల శాఖ అధికారులు మూడేళ్ల క్రితమే సిద్ధమయ్యారు. కానీ.. ఆ పనులను నామినేషన్ పద్ధతిలో తమ అనుచరులకే కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో వాటికి గ్రహణం పట్టుకుంది. ఇప్పటికీ ఆ పనులది అదే దుస్థితి. ట్రిఫుల్ ఆర్ కింద మంజూరైన రూ.90 కోట్లను సద్వినియోగం చేసుకుని ఉంటే.. కనీసం 400 చెరువులు నిండేవనే అభిప్రాయం నీటి పారుదల శాఖ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా.. సప్లయ్ ఛానల్స్(వాగులు, వంకలు) ఆక్రమణలకు గురికావడం, అస్తవ్యస్తంగా మారడం వల్ల వరద నీళ్లు చెరువుల్లోకి చేరక వ ృథా అవుతున్నాయి. వర్షం సమృద్ధిగా కురిసినా ఆయకట్టును బంజరుగా ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది.