'ఉరిశిక్ష రద్దుకే నా మద్దతు'
న్యూఢిల్లీ: భారత్లో ఉరిశిక్ష రద్దు చేసేందుకే తాను మద్దతిస్తానని భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. ఒక రాష్ట్రపతిగా ఉరిశిక్షకు సంబంధించిన కేసులు తన ముందుకు వచ్చినప్పుడు ఎంతో మధనపడేవాడినని, సాధారణంగా అలా వచ్చే కేసులన్నీ కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారివే అయ్యుండేవని చెప్పారు. దేశంలో ఉరిశిక్ష చట్టం పై లాకమిషన్ కొందరు నిపుణుల కొంతకాలంగా సంప్రదిస్తోంది. వారికి ప్రత్యేక పత్రాలు అందించి అభిప్రాయాన్ని తెలుసుకుంటుంది. ఇందులో భాగంగా అబ్దుల్ కలాంను సంప్రదించగా ఆయన ఉరిశిక్ష చట్టం రద్దుకే మొగ్గు చూపి ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పిన అతికొద్దిమంది సరసన చేరారు.
నేరుగా నేరానికి పాల్పడినవారిని ఉరితీస్తున్నామా.. లేక ప్రలోభాలకు తలొగ్గి నేరాలకు పాల్పడుతున్నవారిని శిక్షిస్తున్నామా అని ప్రతిక్షణం తాను ఆలోచిస్తూ ఉండేవాడినని కలాం చెప్పారు. ఈ సందర్భంగా 18 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి, హత్య చేసి ఉరిశిక్షకు గురైన ధనంజయ్ ఛటర్జీ కేసును ప్రస్తావిస్తూ.. ఇలా నేరుగా తీవ్ర నేరాలకు పాల్పడిన వారి విషయంలో మాత్రం ఎలాంటి ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకోవచ్చని, అప్పుడు అలాగే తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో అమలవుతున్న ఉరిశిక్ష చట్టాన్ని అప్ డేట్ చేసేందుకు నిపుణుల సలహాలు తీసుకోవాలని లాకమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.