ఆటోవాలా జిందాబాద్!
సాక్షి, న్యూఢిల్లీ: పూర్వవైభవం సాధించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అన్ని ప్రయత్నాలూ సాగిస్తోంది. ఢిల్లీలో తనకున్న మద్దతును మళ్లీ పెంచుకుని అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో మరోమారు ఆటోడ్రైవర్లను ఆకట్ట్టుకనే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆప్ గురువారం రామ్‌లీలా మైదాన్‌లో ఆటోడ్రైవర్లతో సభ నిర్వహించింది. దాదాపు ఆరు వేల మంది ఆటోడ్రైవర్లు ఈ సభకు హాజరయ్యారు. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రసంగించారు. తమ ప్రభుత్వం ఢిల్లీవాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని ఆయన చెప్పారు. 49 రోజుల పాలనలో ఆప్ సర్కారు ఎన్నో పనులు చేసిందని ఆయన చెప్పారు. తమ పార్టీ పాలనలో లంచగొండితనం తగ్గిందని, ప్రభుత్వ పనితీరు ఎంతగానో మెరుగుపడిందని వివరించారు.
ఆటోవాలాల సమస్యలను తీర్చడానికి ప్రయత్నించామని తెలియజేశారు. అయితే రాష్ట్రపతి పాలన విధించినప్పటి నుంచి ఢిల్లీవాసుల కష్టాలు పెరిగాయని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుస్థిరపాలన అందిస్తుందని స్పష్టం చేశారు. పోలీసులు వేధిస్తున్నట్లయితే సదరు సంభాషణలను రికార్డు చేయాలని ఆయన ఆటోవాలాలను కోరారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత అవినీతి పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆప్‌ను మరోసారి అధికారంలోకి తేవడానికి సహకరించవలసిందిగా ర్యాలీకి హాజరైన ఆటో డ్రైవర్లను కోరారు. ఆటో డ్రైవర్లు రామ్‌లీలా మైదాన్‌కు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆప్ నేతలు ఆరోపించారు.
ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్నది రాష్ట్రపతి పాలన కాదని, పోలీసుల పాలన అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఆటో డ్రైవర్లను పోలీసుల జులుం నుంచి కాపాడడానికి తాము సాయం చేస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్లపై అన్యాయంగా కేసు నమోదైనట్లయితే తామే న్యాయవాదిని నియమించి న్యాయ సహాయం అందిస్తామని కేజ్రీవాల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్లంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పోస్టర్లు అతికించిన ఆటో డ్రైవర్లైను పోలీసులు వేధిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయని, ఒకరిద్దరు పోస్టర్లు అతికించడం వల్ల ఈ సమస్య వస్తోందని పేర్కొన్నారు. డ్రైవర్లంతా పోస్టర్లు అంటించినట్తయిదే ఏ సమస్య ఉండబోదని అరవింద్ కేజ్రీవాల్ భరోసా ఇచ్చారు.