ఊహాజనిత ప్రణాళిక వద్దు
గ్రామాల్లో తిరిగి నీటిఎద్దటి ప్రాంతాలను గుర్తించండి
బిల్లుల చెల్లింపులో జాప్యానికి గల కారణాలపై వివరణ ఇవ్వండి
అనుమతి లేని పనులకు బిల్లులు సమర్పిస్తే టర్మినేట్ చేస్తా
ఆర్డబ్ల్యూఎస్ అధికారులను హెచ్చరించిన కలెక్టర్ యోగితా రాణా
ఇందూరు(నిజామాబాద్ అర్బన్): జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దటి నివారణకు ఊహాజనిత ప్రణాళిక కాకుండా అవసరాన్ని గుర్తించి ప్రతిపాదిక కార్యచరణ ప్రణాళికను అందజేయాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్‌లో మిషన్ భగీరథ, తాగునీటి ఎద్దడిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమ్మర్ కాంటిన్జెన్సీ ప్లాన్‌లో ప్రతిపాదించిన పనులను మరోసారి క్షేత్రస్థాయిలో పర్యటించి అవసరమైన ప్రతిపాదికన ప్రణాళికను ఈ నెల 21లోగా అందజేయాలన్నా రు. భూగర్భ జలాలు పెరగడం, ప్రాజెక్టుల నుంచి నీటి ని విడుదల చేసి చెరువులను నింపేందుకు చర్యలు తీసుకున్నందున.. గతంలో కంటే ఈ సారి అనుకున్న తాగునీటి ఎద్దడి కొన్ని గ్రామాల్లోనే ఏర్పడే అవకాశం ఉందన్నారు.
ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు నీటి ఎద్దటి ఎదురయ్యే గ్రామాలను గుర్తించి కావాల్సిన ప్రణాళికను తయారు చేసి అందించాలన్నా రు. మండల ఏఈలు ఏదీ ప్రతిపాదిస్తే అదే తిరిగి డిప్యూ టీ ఈఈలు, ఈఈలు ప్రతిపాదనలు పంపడం సరికాదన్నారు. గతేడాది నీటిఎద్దటి ఎక్కువగా ఉన్నందున ఆ ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేసి కార్యచరణ ప్రణాళిక తయారు చేసినట్లుగా తాను గమనించినట్లు కలెక్టర్ తెలిపారు. గతేడాది తాగునీటి ఎద్దటి నివారణకు చేపట్టిన పనులకు ఇప్పటికీ బిల్లులు చెల్లింపులు జరపలేదని, ఎందుకు జాప్యం చేస్తున్నారో వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను ప్రశ్నించా రు. నాన్ సీఆర్ఎఫ్ పనులు రూ. 2 కోట్ల 36లక్షల బిల్లు లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పెండింగ్‌లో ఉన్న బి ల్లులన్నీ ఈ నెల 16లోగా సంబంధిత ట్రెజరీలలో, పీవో కార్యాలయాల్లో అందజేయాలని, లేదంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
అనుమతి లేని పనులకు బిల్లులు సమర్పిస్తే సంబంధిత ఇంజినీర్ అధికారులపై సుమోటోగా తీసుకుని టర్మినెట్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం జేసీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎండా కాలంలో తాగునీటి ఎద్దటి నివారణకు చేపట్టాల్సిన తక్షణ చర్యల్లో భాగంగా మండలాధికారులు గ్రామాలను గుర్తించి నివేదిక అందజేయాలని తెలిపారు. సమావేశంలో మిషన్ భగీరథ సీఈ జగన్మోహన్ రెడ్డి, చక్రవర్తి, ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.
అవసరమైన చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన తక్షణ వైద్యసేవలందించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో టాటా కన్సల్టెన్సీ ప్రతినిధులు, వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. టాటా కన్సల్టెన్సీ ప్రతినిధులు సూచించిన విధంగా అన్ని చర్యలు తీసువాలని వైద్యులను ఆదేశించారు.
అవుట్‌పేషెంట్లు వివిధ రకాల సేవలు పొందేందుకు ఎక్స్‌రే, అల్ట్రా సౌండ్, డ్యూటీ డాక్టర్లు తదితర బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వీల్ చైర్స్, టైలర్స్, ఇంటర్‌కమ్, తాగునీటి వసతి, లిఫ్ట్‌ల నిర్వహణ మరమ్మతులకు కావాల్సిన నిధుల కోసం ప్రతిపానదలు తయారు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు, డిప్యూటీ సూపరింటెండెంట్ సుజన, ఆర్వో టాటా కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.