‘పాస్ చేయకుంటే నిప్పుపెట్టుకుంటా’
గాంధీ ఆస్పత్రి : సూపర్ స్పెషాలిటీ కోర్సు ప్రాక్టికల్స్‌లో కావాలనే తనను ఫెయిల్ చేస్తున్నారని ఆరోపిస్త్తూ కిరోసిన్ బ్యాటిల్, అగ్గిపెట్టె పట్టుకుని సూపరింటెండెంట్ పేషీ వద్ద వైద్యుడు హల్చల్ చేసిన ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో జరిగింది. బాధితుడు, ఆస్పత్రివర్గాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ట్యూటర్‌గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ అజాం (45) సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంఎస్ జనరల్ సర్జన్ సెకెండ్ పీజీ (సూపర్ స్పెషాలిటీ) చదువుతున్నాడు. ఎంబీబీఎస్ నుంచి మంచి మార్కులతో ఉత్తీర్ణుడు అవుతున్న అజాం ఇటీవల జరిగిన సూపర్ స్పెషాలిటీ సెకెండ్ పీజీ ప్రాక్టికల్స్‌లో మాత్రం ఫెయిలయ్యాడు.
దీనిపై ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేయగా దానిపై గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాక్టికల్స్ ఫెయిల్ కావడాన్ని జీర్ణించుకోలేని అజాం కొంతకాలంగా మానసిక వేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం కమిటీ ముందు హాజరై తన వాదన వినిపించాడు. అనంతరం ముందే తనతో తెచ్చుకున్న కిరోసిన్ బ్యాటిల్, అగ్గిపెట్టె పట్టుకుని గాంధీ సూపరింటెండెంట్ పేషీలోకి దూసుకెల్లాడు. కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా ఆస్పత్రి సిబ్బంది అడ్డుకుని, పోలీసులకు సమాచారం అందించారు. వైద్యాధికారులు, పోలీసులు ఆజాంకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కమిటీ నివేదిక ఆధారంగా తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.