‘శిరోమణి’ నేత కుమారుడి అరెస్టు
సోదరుడిని ముంచిన కేసులో కటకటాల్లోకి
నేడో-రేపో నగరానికి తరలించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: పంజాబ్‌కు చెందిన రాజకీయ పార్టీ శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) సివిల్ లైన్స్ సర్కిల్ అధ్యక్షుడు సురేందర్ బన్సాల్ కుమారుడు సందీప్‌ను హైదరాబాద్ పోలీసులు గురువారం అక్కడి బటాలాలో అరెస్టు చేశారు. నగరంలో నివసిస్తున్న సురేందర్ సోదరుడు ప్రబోధ్ బన్సాల్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. తన సోదరుడైన సురేందర్, ఆయన కుమారులు అమిత్, సందీప్‌లు కుట్రపన్ని బోగస్ సంతకాలతో తనకు సంబంధించిన రూ.1.7 కోట్ల షేర్లు కాజేశారనేది ప్రబోధ్ ఆరోపణ. దీనిపై వారిని ప్రశ్నించగా తనపై దాడి చేశారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా తమ ఎదుట హాజరుకావాలని గతంలోనే అనేకసార్లు పోలీసులు ముగ్గురు నిందితుల్నీ కోరారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో గురువారం బటాలా చేరుకున్న ప్రత్యేక బృందం సురేందర్ ఇంటిపై దాడి చేసింది.
మిగిలిన ఇద్దరూ తప్పించుకోగా సందీప్ పోలీసులకు చిక్కాడు. స్థానిక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అమిత్ సింగ్ ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టిన స్పెషల్ టీమ్ అతడిని హైదరాబాద్ తరలించేందుకు ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ పొందింది. శుక్ర-శనివారాల్లో సందీప్‌ను సిటీకి తీసుకువచ్చి స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు.