పనాజీ మేయర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
పనాజీ : ఫోటో సెషన్‌పై అత్యుత్సాహం చూపిన పనాజీ మేయర్ సురేంద్ర ఫర్తాడో వ్యవహారం చివరకు ఎఫ్ఐఆర్ నమోదు వరకూ వెళ్లింది. ఈ ఏడాది జూన్‌లో మురికి కాలువను శుభ్రం చేసే మిషన్ పైకి మీడియాతో మాట్లాడేందుకు యత్నించిన మేయర్‌కు... బరువు ఎక్కువై అది బోల్తాపడి పడిపోయిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. దీనిపై పనాజీకి చెందిన ఓ న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రయిల్ కోర్టు ... మేయర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్లు 280, 287 కింద కేసు నమోదు చేశారు. మేయర్ తో పాటు మరో ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, వారిలో ఇద్దరు జర్నలిస్టులు కూడా ఉన్నారు.
కాగా పనాజీ సిటీ మేయర్ సురేంద్ర ఫర్తాడో అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకు చూపించాలనుకున్నారు. ప్రత్యేకంగా మీడియాను పిలిచి మురికి కాలువను శుభ్రం చేసే మిషన్‌పైకి ఎక్కారు. ఇంతలో అది బోల్తా కొట్టి మురికి కాలువలో పడ్డారు. మేయర్‌తో పాటు పలువురు అధికారులు కూడా మిషన్‌పైకి ఎక్కడంతో అది ఒక్కసారిగా బోల్తా కొట్టింది. దీంతో మేయర్ సహా అందులో ఉన్న వారంతా మురికి కాలువలో పడిపోయారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్న విషయం తెలిసిందే. కాగా మేయర్ అనాలోచిత చర్య వల్ల పలువురి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.