పాల దిగుబడిపై వ్యాధుల ప్రభావం
ఒంగోలు టూటౌన్ : ‘వాతావరణాన్ని బట్టి పశువులకు వ్యాధులు సోకుతుంటాయి. వ్యాధుల ప్రభావం పాల దిగుబడిపై పడుతుంది. దుక్కులు దున్నే పశువులు పని సామర్థ్యం కోల్పోవడం, పెయ్యలు ఎదకు రాకపోవడం లాంటి నష్టాలు వాటిల్లుతుంటాయి.
వ్యాధులను సకాలంలో గుర్తించి, వైద్యం అందించకపోతే పశువులు చనిపోయే ప్రమాదం ఉంద’ని ఒంగోలు పశువైద్యాధికారి సురేంద్రప్రసాద్ తెలిపారు. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో పశువులను పరిశీలించడం ద్వారా పశువుల అనారోగ్య సమస్యలు, ఎద లక్షణాలు గమనించవచ్చని చెప్పారు.
అనారోగ్య లక్షణాలను
గుర్తించడం ఇలా..
పశువులు నిలబడటం, కదలిక, ప్రవర్తనలో మార్పులు కనపడతాయి. యజమాని పిలిచినా స్పందించవు. పశువు నిలబడినప్పుడు వంగిపోయినట్లు, తలను నేలకు ఆనించి ఉంటాయి. నడకలో నెమ్మది ఉంటుంది.
మేత, నీరు సక్రమంగా తీసుకోవు. నెమరు వేయవు. నోటి నుంచి సొంగ కారుతుంది.
చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది. వెంట్రుకలు (రోమాలు) పైకి లేస్తాయి.
జ్వరం ఉంటుంది. ముట్టె తడారిపోయి, పొడిగా ఉంటుంది.
శ్వాస వేగంగా లేదా కష్టంగా ఉంటుంది. నాడి వేగంగా కొట్టుకొంటుంది.
కళ్లు ఎర్రబడి నీరు కారుతుంది. పుసులు వస్తాయి. పేడ పలుచగా లేదా గట్టిగా, రక్తంతో, జిగురుగా, నల్లగా ఉంటుంది.
మూత్రం చిక్కగా, తక్కువ పరిమాణంలో, రంగుమారి, వాసనతో వస్తుంది.
వ్యాధుల రకాలు
వైరస్ ద్వారా గాలికుంటు, శ్వాసకోశ, మెదడువాపు, మశూచి, తలవాపు లాంటి వ్యాధులు వస్తాయి.
నూతన కాంగో వైరస్ జ్వరం పొంచి ఉంది. సూక్ష్మజీవుల ద్వారా గొంతువాపు, జబ్బవాపు, దొమ్మ, బ్రూసెల్లోసీస్, లెప్టోస్పైరోసిస్ లాంటి వ్యాధులు వ్యాపిస్తాయి. పరాన్న జీవుల ద్వారా కుందేటి వెర్రి, బేబీ సియోసిస్, మైక్రోఫైలేరియా, కాలేయవుజలగ, జీర్ణాశయపు జలగ, మూగబంతి, తదిరర వ్యాధులు సోకుతాయి.
జీర్ణక్రియలో లోపాల వల్ల పాలజ్వరం,పొదుగు వాపు, పడకజబ్బు, కిటోసిస్ వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులను సకాలంలో గుర్తించి పశువైద్యాధికారులను సంప్రదించడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చు.