కోల్ స్కాం: వారి పేర్లను చార్జీషీటులో చేర్చండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో అప్పటి బొగ్గుశాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ లతో పాటు మరో 13 మంది పేర్లను కుట్ర, మోసం తదితర నేరాల కింద చార్జీ షీట్లలో చేర్చాలని ప్రత్యేక కోర్టు సీబీఐకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్డి భరత్ పరాషార్ మాట్లాడుతూ అమర్ కొండ బొగ్గు క్షేత్రాన్ని జిందాల్ గ్రూప్, గగన్ ఇన్ ఫ్రా ఎనర్జీ లిమిటెడ్, సౌభాగ్య మీడియా లిమిటెడ్, న్యూఢిల్లీ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ లకు ఇవ్వడంలో జరిగిన అవినీతిలో పాలు పంచుకున్న అప్పటి జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కొడా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్ సీ గుప్తాల పేర్లను కూడా చార్జీషీట్లో చేర్చాలని ఆదేశించారు.
నిందితుల పేర్లపై చార్జీషీట్లను చేర్చేందుకు వాదనలు వినిపించిన సీబీఐ... మాజీ జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కొడా జేఎస్పీఎల్, జీఎస్ఐపీఎల్ లకు బొగ్గు గనులను కేటాయించడంలో కీలక పాత్ర వహించారని ఆరోపించింది. దీనిపై ప్రతివాదనలు వినిపించిన నిందితుల తరఫు న్యాయవాది అవన్నీ నిరాధారమని, చార్జీ షీట్లలో పేర్లను నమోదు చేయడం కుట్రపూరితమని కోర్టుకు తెలిపారు.
ఈ కేసులో దోషిగా ఉన్న సురేశ్ సింఘాల్ ఏప్రిల్ 21న కోర్టును క్షమాభిక్ష కోరుతూ అప్రూవర్ గా మారారు. దీంతో ఏసీబీ, 14 మంది దోషులకు కోర్టు నోటీసులు జారీచేసింది. మేజిస్ర్టేట్ ఆయన వాంగ్మూలాన్ని స్వీకరించి సీల్డ్ కవర్ ప్రత్యేకకోర్టుకు అందజేశారు. మే 11న తదుపరి విచారణను వాయిదా వేస్తూ సింఘాల్ అభ్యర్ధనపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐను ఆదేశించింది.