నైరుతి తిరోగమనంతో మళ్లీ ఎండలే!
సాక్షి, విశాఖపట్నం: రాష్ర్టంలో వాతావరణం మారుతోంది. ఇన్నాళ్లూ బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణులు పొరుగు ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఒకేప్రాంతంలో స్థిరపడిపోయి, బలహీనపడిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు కొన్నాళ్లు ప్రభావం చూపినా ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది.
ఈ నేపథ్యంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడేంతవరకు, ఈశాన్య రుతుపవనాల ఆగమనం, నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పడడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వీటన్నింటి కారణంగా రాష్ట్రంలో కొన్నాళ్లపాటు మళ్లీ ఎండలు తప్పవని, కొన్ని ప్రాంతాల్లో 34 నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నా, అది బలహీనంగానే ఉందని స్పష్టం చేశారు. రానున్న 24 గంటల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని, అది కూడా తీర ప్రాంతాల్లోనే ఈ అవకాశం ఉందన్నారు.