హిజ్రాలపై టీడీపీ నేత ఆటవిక దాడులు
► సంపాదనంతా తనకే ఇవ్వాలని హిజ్రాలకు రూల్
► మాట వినకపోతే చిత్ర హింసలే
► యువకులకు చీరలు కట్టించి నకిలీ హిజ్రాలుగా మార్పు
► రూ.కోట్లకు పడగలెత్తిన అధికార పార్టీ నేత సూరాడ ఎల్లాజీ
► యువకుడి ఫిర్యాదుతో ఎల్లాజీ అరెస్టు
సాక్షి, విశాఖపట్నం/అల్లిపురం: హిజ్రాలకు ‘నేత’ అయ్యాడు. రోజూ సంపాదించిన సొమ్మంతా తనకే అప్పగించేలా వారిని దారిలోకి తెచ్చుకున్నాడు. రూ.కోట్లకు అధిపతిగా మారాడు. చివరకు పాపం పండి కటకటాల వెనక్కి చేరాడు. హిజ్రాల నాయకుడిగా వ్యవహస్తూ అరాచక శక్తిగా మారిన అతడి పేరు సూరాడ ఎల్లాజీ. విశాఖపట్నంలో 29వ వార్డు టీడీపీ అధ్యక్షుడు. విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు అనుంగు శిష్యుడు. ప్రధాన అనుచరుడు. దశాబ్దానికి పైగా విశాఖ కేంద్రంగా హిజ్రాలకు రారాజుగా వెలుగొందుతూ ఎల్లాజీ వారితో ఎన్నో ఆగడాలు చేయించేవాడు. అడిగినంత సొమ్ము తెచ్చివ్వకపోతే నరకం చూపేవాడు.
ఒక్కొక్కరు రోజుకు కనీసం రూ.300 నుంచి రూ.వెయ్యి వరకు తెచ్చి ఇచ్చేలా రూల్ పెట్టాడు. ఇందులో కొంచెం తగ్గినా ఘోరంగా హింసించేవాడు. అందమైన యువకులను ముగ్గులోకి దించి వారికి చీరలు, డ్రెస్సులు వేసి ఫొటోలు తీయించేవాడు. నకిలీ హిజ్రాలుగా మార్చేవాడు. హిజ్రాలుగా కొనసాగకపోతే ఆ ఫొటోలను వారి తల్లిదండ్రులకు చూపిస్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇలా తన సామ్రాజ్యంలో 300 మందిని చేర్చుకున్నాడు. తనకు లొంగిన హిజ్రాలతో దౌర్జన్యాలు చేయించేవాడు. రెండేళ్ల క్రితం ఎల్లాజీ అధీనంలో ఉన్న అనూష అనే హిజ్రా హత్యకు గురైంది. కిషోర్ అనే వ్యక్తితో అనూష విజయవాడకు వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని ఎల్లాజీ ఆమెను గాలించి పట్టుకుని, హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. అప్పట్లో అది అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
పాపం పండిందిలా...
ఇటీవల భూపేష్‌నగర్‌కు చెందిన గణేష్ అనే యువకుడు తనకు ఎల్లాజీ మత్తు మందులు ఇచ్చి, హిజ్రాగా వేషం వేసి ఫొటోలు తీసి తన భార్యకు పంపడంతో ఆమె తనను వదిలి వెళ్లిపోయిందంటూ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఎల్లాజీని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎల్లాజీపై గతంలో ఉన్న అనూష హత్య కేసును నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ తిరగతోడారు. అనూష అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్పు చేశారు. ఎల్లాజీ ప్రస్తుతం సెంట్రల్ జైలులో ఉన్నాడు.
జైలులో ఉండి కూడా బెదిరిస్తున్నాడు
ఎల్లాజీ జైలుకెళ్లడంతో ఇన్నాళ్లూ అతడి కబంధ హస్తాల్లో చిక్కుకున్న హిజ్రాలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. రోజూ పలువురు హిజ్రాలు వివిధ పోలీస్స్టేషన్లలో ఎల్లాజీ ఆగడాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు ఎల్లాజీ జైలు ఉండి కూడా తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని 50 మంది హిజ్రాలు ఆదివారం టూటౌన్ సీఐ జీవీ రమణకు ఫిర్యాదు చేశారు. అతడి నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఎల్లాజీకి టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ బహిరంగంగా అండగా నిలుస్తున్నారు. ఎల్లాజీని టీడీపీ నుంచి బహిష్కరించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నా ఎమ్మెల్యే లెక్కచేయడం లేదు. ఎల్లాజీయే వార్డు అధ్యక్షుడిగా కొనసాగుతారని ప్రకటించారు.