Survey Satya Narayana
-
కేసీఆర్ కోసం తల్వార్లు సిద్ధం
సిద్దిపేట టౌన్: హరీశ్‌ను సీఎం చేయకపోతే కేసీఆర్ సంగతి చూడటానికి ఆయన వర్గం ఎమ్మెల్యే లు తల్వార్లు పట్టుకొని తయార్గా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం మానకొండూరు నియోజకవర్గంలో నిర్వహించనున్న ప్రజాచైతన్య యాత్రకు వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట పట్టణ శివారు పొన్నాలలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యమంలో మామ వెన్నంటే ఉన్న హరీశ్‌రావును సీఎం రేసు నుంచి తప్పించి కొడుకును సీఎం చేయాలనే ప్రయత్నంలో భాగమే థర్డ్‌ఫ్రంట్ నాటకమని, అమెరికాలో చదువుకొని తెలంగాణకు కేటీఆర్ రాగానే మంత్రి పదవితో ముఖ్యమంతి కేసీఆర్ ఉద్యోగం కల్పించారని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావును బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు హరీశ్‌రావు ఎమ్మెల్యేగా పనిచేశాడని, ఆయన పనితీరు చూసి సీఎం అయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఆనాడే చెప్పానని సర్వే వ్యాఖ్యానించారు. తానిచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే థర్డ్ ఫ్రంట్‌ను నెత్తినెత్తుకున్నారని, ఫ్రంట్లకు నాయకత్వం వహించిన చంద్రబాబు నాయుడే మూలకు పోయాడని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ మంచితనం పనికిరాదు.. ఉత్తమ్ కుమార్‌రెడ్డి చాలా మంచి వ్యక్తని, అలా మంచితనంతో ఉంటే రాజకీయాలలో పనిచేయదని, కేసీఆర్ లాగా తిమ్మిని బమ్మి చేసే వారే పనికొస్తారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సర్వేల్లో కాం గ్రెస్‌కు 101 సీట్లు వస్తున్నాయని తెలిసినా 70 సీట్లే వస్తున్నాయని ఉత్తమ్ చెప్పాడని, కానీ అదే సర్వే రిపోర్టును కేసీఆర్ తీసుకొని తమకు 3 సీట్లే వస్తాయనే విషయం తెలిసినా 101 సీట్లు వస్తా యని నమ్మబలుకుతున్నారని ఎద్దేవా చేశారు. -
‘ధర్మయుద్ధం’ విజయవంతం చేయండి
♦ పలు పార్టీల నాయకుల పిలుపు ♦ వర్గీకరణ జరిగితేనే దళితుల అభివృద్ధి సాధ్యం: సర్వే హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరగనున్న ధర్మయుద్ధం మహా సభను విజయవంతం చేయాలని పలు పార్టీలకు చెందిన నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం హైద రాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మంద కృష్ణమాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ మాల, మాదిగల పంచాయితీ ఆం ధ్రా, తెలంగాణ లాంటిదని, రెండు రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ముల్లా కలసి ఉంటామన్నట్లే, ఎస్సీ రిజర్వేషన్ చేస్తేనే దళితులంతా అభివృద్ధి చెందుతారని అన్నారు. సీఎం కేసీఆర్ గంజిలో ఈగను తీసేసినట్లు రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేశారని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే మాదిగ ధర్మయుద్ధం సభకు హాజరు కావాలని అన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజ య్య మాట్లాడుతూ తాను ఎంఆర్పీఎస్ కార్యకర్తగా ఉండి ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని అన్నారు. మాదిగలంతా వర్గీకరణ కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు. మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ 23 ఏళ్లుగా వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని, 59 ఉప కులాలకు సమన్యాయం జరిగేందుకే వర్గీకరణ అని అన్నారు. బీజేపీ వర్గీకరణ చేసేందుకు సిద్ధంగా ఉందని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఈ సమస్యను భుజాన వేసుకున్నారని అన్నారు. వర్గీకరణ కోసం అంతిమ పోరాటమిది ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధన దిశ గా జరిగే అంతిమ పోరాటమే ఈ ధర్మయుద్ధం అని అన్నారు. వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీల పూర్తి మద్దతు ఉందన్నారు. కేంద్రంలో కూడా అన్ని పార్టీలు సుముఖంగానే ఉన్నాయని అన్నారు. కేవ లం మాలల్లోని కొంతమంది స్వార్థపరులు రెండు సార్లు వర్గీకరణను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ లేకపోవడంవల్లే తాము వెనక బడి ఉన్నామని చెప్పేందుకే ఈ ధర్మ యుద్ధమని అన్నారు. దళితులే కాకుండా ధర్మం పక్షాన నిలబడే అందరూ పార్టీలకతీతంగా ధర్మయుద్ధాన్ని విజయ వంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ తదితరులు పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, బీజేపీ నాయకులు రాములు, సాంబమూర్తి, బొట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
మల్కాజిగిరి సర్వేదే..చేవెళ్ల నుంచి కార్తీక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం శనివార ం రాత్రి అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కేవలం లోక్‌సభ అభ్యర్థుల పేర్లనే వెల్లడించింది. జిల్లాలోని మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణకు, చేవెళ్ల నుంచి కార్తీక్‌రెడ్డికి టికెట్లు దక్కాయి. శాసనసభ అభ్యర్థులను కూడా నిర్ణయించినప్పటికీ, చివరి నిమిషంలో జాబితాను వాయిదా వేశారు. ఊహించినట్లుగానే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి స్థాన మార్పిడి జరిగింది.మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి మారాలనే ఆయన నిర్ణయానికి అధిష్టానం తలూపింది. దీంతో ఆయన స్థానంలో కార్తీక్‌రెడ్డికి టికెట్ లభించింది. కాగా, మరో కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణకు సిట్టింగ్ స్థానమే దక్కింది. ఫలించిన కార్తీక్‌రెడ్డి ప్రయత్నం... చేవెళ్ల నుంచి పార్లమెంటుకు పోటీచేయాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. సీనియర్ నేత జైపాల్ రెడ్డి రాకతో 2009లో చివరి నిమిషంలో పార్టీ టికెట్టు కోల్పోయిన కార్తీక్.. ఈసారి పట్టువదలకుండా పోరాడి బీ ఫారం దక్కించుకున్నారు. ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్న కార్తీక్.. మూడు నెలల క్రితమే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. సీటు మారుతున్నట్లు జైపాల్ వెల్లడించకముందే చేవెళ్ల పార్లమెంటుపై తన ఇష్టాన్ని ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర బహిరంగ పరిచారు. ఈసారి కూడా పార్లమెంటు స్థానానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. జైపాల్ తప్పుకున్నప్పటికీ, తన స్థానంలో మరో సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని బరిలోకి దించాలని గట్టి ప్రయత్నమే చేశారు. కుటుంబంలో ఒకరికే సీటు అని కాంగ్రెస్ నిబంధన పెట్టడంతో ఒకదశలో సబితా ఇంద్రారెడ్డికే చేవెళ్ల ఎంపీ టికెట్ ఖరారవుతుందని అంతా భావించారు. ఇదే విషయాన్ని అధిష్టానం కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆదినుంచి స్థానంపై ఎంతో మక్కువ ప్రదర్శించిన తన కుమారుడికే సీటు కేటాయించేలా పార్టీ పెద్దలను ఒప్పించారు. సాధించిన ‘సర్వే’ సిట్టింగ్ స్థానాన్ని మంత్రి సర్వే సత్యనారాయణ తిరిగి నిలబెట్టుకున్నారు. జనరల్ స్థానమైనా మల్కాజ్గిరి లోక్ సభ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించినా సర్వే అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. అగ్రనేతలు, సెలబ్రిటీల పేర్లు ఆశావహుల జాబితాలో కనిపించినా.. చివరకు సర్వే పలుకుబడి ముందు నిలబడలేదు. కాగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చే భువనగిరి లోక్‌సభ స్థానం కూడా సిట్టింగ్ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డికే ఖ రాయింది. తొలుత ఇక్కడి నుంచి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రేసులో నిలవడం.. కోమటిరెడ్డి బ్రదర్స్ దీన్ని వ్యతిరేకించడంతో అధిష్టానం ఈ సీటు విషయంలో పునరాలోచన చేసింది. ఇదిలావుండగా, రాష్ట్ర విభజన అనంతరం టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ నాగర్‌కర్నూలు నుంచి లోక్‌సభ బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది. లోక్‌సభకు పోటీచేసేందుకు ఆయన ఆసక్తి చూపడంతో ఈ స్థానానికి మరొకరిని ఖరారు చేశారు. పెండింగ్‌లో మహేశ్వరం..! కాగా, మహేశ్వరం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోయింది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి సబిత ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈసారి ఆమె రాజేంద్రనగర్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. మరోవైపు సీపీఐతో పొత్తులో భాగంగా ఈ సీటును ఆపార్టీకి కేటాయించే అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీటును పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. మరోవైపు సబిత ఖాళీ చేసిన మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించరాదని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. సంస్థాగత నిర్మాణంలేని ఆ పార్టీ ప్రభావం... చేవె ళ్ల ఎంపీ స్థానంపై పడుతుందని వారు వాదిస్తున్నారు.