మల్కాజిగిరి సర్వేదే..చేవెళ్ల నుంచి కార్తీక్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను ప్రకటించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం శనివార ం రాత్రి అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ కేవలం లోక్‌సభ అభ్యర్థుల పేర్లనే వెల్లడించింది. జిల్లాలోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ సర్వే సత్యనారాయణకు, చేవెళ్ల నుంచి కార్తీక్‌రెడ్డికి టికెట్లు దక్కాయి.
శాసనసభ అభ్యర్థులను కూడా నిర్ణయించినప్పటికీ, చివరి నిమిషంలో జాబితాను వాయిదా వేశారు. ఊహించినట్లుగానే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి సూదిని జైపాల్‌రెడ్డికి స్థాన మార్పిడి జరిగింది.మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానానికి మారాలనే ఆయన నిర్ణయానికి అధిష్టానం తలూపింది. దీంతో ఆయన స్థానంలో కార్తీక్‌రెడ్డికి టికెట్ లభించింది. కాగా, మరో కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణకు సిట్టింగ్ స్థానమే దక్కింది.
ఫలించిన కార్తీక్‌రెడ్డి ప్రయత్నం...
చేవెళ్ల నుంచి పార్లమెంటుకు పోటీచేయాలన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి చిరకాల వాంఛ ఎట్టకేలకు నెరవేరింది. సీనియర్ నేత జైపాల్ రెడ్డి రాకతో 2009లో చివరి నిమిషంలో పార్టీ టికెట్టు కోల్పోయిన కార్తీక్.. ఈసారి పట్టువదలకుండా పోరాడి బీ ఫారం దక్కించుకున్నారు. ఈసారి ఎలాగైనా ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్న కార్తీక్.. మూడు నెలల క్రితమే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
సీటు మారుతున్నట్లు జైపాల్ వెల్లడించకముందే చేవెళ్ల పార్లమెంటుపై తన ఇష్టాన్ని ‘తెలంగాణ నవ నిర్మాణ యాత్ర’ పేర బహిరంగ పరిచారు. ఈసారి కూడా పార్లమెంటు స్థానానికి పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. జైపాల్ తప్పుకున్నప్పటికీ, తన స్థానంలో మరో సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డిని బరిలోకి దించాలని గట్టి ప్రయత్నమే చేశారు. కుటుంబంలో ఒకరికే సీటు అని కాంగ్రెస్ నిబంధన పెట్టడంతో ఒకదశలో సబితా ఇంద్రారెడ్డికే చేవెళ్ల ఎంపీ టికెట్ ఖరారవుతుందని అంతా భావించారు. ఇదే విషయాన్ని అధిష్టానం కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఆదినుంచి స్థానంపై ఎంతో మక్కువ ప్రదర్శించిన తన కుమారుడికే సీటు కేటాయించేలా పార్టీ పెద్దలను ఒప్పించారు.
సాధించిన ‘సర్వే’
సిట్టింగ్ స్థానాన్ని మంత్రి సర్వే సత్యనారాయణ తిరిగి నిలబెట్టుకున్నారు. జనరల్ స్థానమైనా మల్కాజ్‌గిరి లోక్ సభ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలంతా వ్యతిరేకించినా సర్వే అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపడం గమనార్హం. అగ్రనేతలు, సెలబ్రిటీల పేర్లు ఆశావహుల జాబితాలో కనిపించినా.. చివరకు సర్వే పలుకుబడి ముందు నిలబడలేదు. కాగా, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్ వచ్చే భువనగిరి లోక్‌సభ స్థానం కూడా సిట్టింగ్ సభ్యుడు కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికే ఖ రాయింది.
తొలుత ఇక్కడి నుంచి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య రేసులో నిలవడం.. కోమటిరెడ్డి బ్రదర్స్ దీన్ని వ్యతిరేకించడంతో అధిష్టానం ఈ సీటు విషయంలో పునరాలోచన చేసింది. ఇదిలావుండగా, రాష్ట్ర విభజన అనంతరం టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ నాగర్‌కర్నూలు నుంచి లోక్‌సభ బరిలో నిలుస్తారని ప్రచారం జరిగింది. లోక్‌సభకు పోటీచేసేందుకు ఆయన ఆసక్తి చూపడంతో ఈ స్థానానికి మరొకరిని ఖరారు చేశారు.
పెండింగ్‌లో మహేశ్వరం..!
కాగా, మహేశ్వరం అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోయింది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి సబిత ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈసారి ఆమె రాజేంద్రనగర్ నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. మరోవైపు సీపీఐతో పొత్తులో భాగంగా ఈ సీటును ఆపార్టీకి కేటాయించే అంశాన్ని హైకమాండ్ పరిశీలిస్తోంది.
ఈ క్రమంలోనే ఈ సీటును పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. మరోవైపు సబిత ఖాళీ చేసిన మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించరాదని స్థానిక కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు. సంస్థాగత నిర్మాణంలేని ఆ పార్టీ ప్రభావం... చేవె ళ్ల ఎంపీ స్థానంపై పడుతుందని వారు వాదిస్తున్నారు.