8 రోజులు సజీవ సమాధి.. అయినా బతికిన చిన్నారి!
చైనాలో గ్రహణం మొర్రితో పుట్టిన ఓ బాబును ఆమె తల్లిదండ్రులు ఓ చెక్క పెట్టెలో పెట్టి భూమిలో పూడ్చేశారు. కానీ, 8 రోజుల తర్వాత ఆమెను ఎవరో బయటకు తీస్తే.. చిన్నారి క్షేమంగా ఉంది!! అదృష్టవశాత్తు ఆ చెక్కపెట్టెలోకి కొంత గాలి, నీరు మాత్రం వెళ్లాయి. బూట్లు పెట్టుకునే పరిమాణంలో ఉన్న బాక్సులో ఆ చిన్నారిని కప్పిపెట్టారు. అయితే, 8 రోజుల తర్వాత అటువైపు మూలికల కోసం వచ్చిన ఓ మహిళకు అబ్బాయి ఏడుపు వినిపించడంతో అనుమానం వచ్చి తవ్వి చూసింది. వెంటనే బయటకు తీసి సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చింది.
వైద్యులు పరీక్షించేసరికి ఆ అబ్బాయి నోట్లోంచి మట్టి ఉమ్ముతున్నాడు. పిల్లాడిని కావాలని హతమార్చే ప్రయత్నం చేశారన్న నేరం కింద ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనాలో ఇలాంటి అవకరాలు ఉన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఎలాగోలా వాళ్లను వదిలించుకోడానికే ప్రయత్నిస్తుంటారు. అక్కడ కుటుంబ నియంత్రణ నిబంధనలు గట్టిగా ఉండటం, ఇలాంటి పిల్లల వైద్య ఖర్చులు భరించలేకపోవడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.