పోలీస్ అధికారిగా విక్రమ్
నటుడు సూర్య కోసం తయారు చేసిన కథలో విక్రమ్ నటించడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. అంజాన్ చిత్రానికి ముందు సూర్య గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ధ్రువనక్షత్రం చిత్రం చేయాల్సి ఉంది. అయితే గౌతమ్‌మీనన్ తయారు చేసిన కథ నచ్చలేదంటూ సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తదుపరి సూర్య అంజాన్ చిత్రాన్ని, గౌతమ్‌మీనన్ అజిత్ హీరోగా ఎన్నైఅరిందాల్ చిత్రాన్ని చేశారు. గౌతమ్‌మీనన్ ప్రస్తుతం శింబు హీరోగా అచ్చంయంబదు మడమయడా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత గౌతంమీనన్ విక్రమ్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు.
అయితే ఇది సూర్య కోసం సిద్ధం చేసిన కథతో రూపాందించే చిత్రం అని సమాచారం. ఇందులో విక్రమ్ పోలీస్ అధికారిగా పవర్ఫుల్ పాత్రలో నటించనున్నారని తెలిసింది. సూర్య కోసం సిద్ధం చేసిన కథలో విక్రమ్ కోసం మార్పులు చేర్పులు చేస్తున్నట్లు టాక్. ఇంతకు ముందు కాక్కకాక్క చిత్రంలో పోలీస్ అధికారిగా చూపించిన గౌతమ్ మీనన్ తాజా చిత్రంలో విక్రమ్‌ను మరో విభిన్నకోణంలో తెరపై ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.అదే విధంగా విక్రమ్ ఇంతకు ముందు సామి చిత్రంలో పోలీస్ అధికారి పాత్రలో
దుమ్మురేపారన్నది గమనార్హం.