'టీడీపీలో చేరకపోతే చంపేస్తామన్నారు'
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో మంత్రి పరిటా సునీత ఆదేశాలతోనే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని మరోసారి రుజువైంది. టీడీపీలో చేరకపోతే చంపుతామని తనను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరించారని దాడికి గురైన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పరిటాల సునీత ఆదేశాలతోనే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మంత్రి సునీత తనయుడు శ్రీరామ్ సమక్షంలోనే నాపై దాడి జరిగింది. కానీ నాతో బలవంతంగా టీడీపీ నేతలు సంతకాలు సేకరించారు.
టీడీపీలో చేరకపోతే చంపుతామని బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయిస్తుంటే పోలీసులు ఏమీ అనలేదు. అదే సంతకంతో వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి చందు, నాగరాజులపై పోలీసులు అక్రమంగా కేసులు నమోదుచేశారు. పరిటాల వర్గీయులు అరాచకాలు చేస్తుంటే రామగిరి సీఐ, ఎస్ఐ, ఇతర పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. మంత్రి సునీత నుంచి నాకు ప్రాణహాని ఉంది, దయచేసి రక్షణ కల్పించాలంటూ వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బోయ సూర్యం విజ్ఞప్తి చేశారు.
మంత్రి సునీతను పదవి నుంచి బర్తరఫ్ చేయాలి: ప్రకాష్ రెడ్డి
రామగిరి మండలంలో పోలీసు వ్యవస్థ లేదు. మంత్రి పరిటాల సునీత అరాచకాలపై ఎస్పీ మౌనంగా ఉన్నారు. రామగిరిలో సమావేశాలు నిర్వహించేందుకు మూడేళ్లుగా అడుగుతున్నా అనుమతి ఇవ్వటం లేదు. మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ అరాచకంగా వ్యవహరిస్తున్నారు. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త సూర్యంపై దాడి చేసి.. మాపైనే అక్రమ కేసులు బనాయించటం ఏం న్యాయమని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి పరిటాల సునీతను వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఏపీ సర్కార్ను డిమాండ్ చేశారు. పరిటాల వర్గీయుల అరాచకాలపై హైకోర్టులో కేసు వేసి న్యాయాన్ని పరిరక్షించుకుంటామని ప్రకాష్ రెడ్డి అన్నారు.
వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి